Share News

చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ

ABN , Publish Date - Feb 17 , 2026 | 05:31 AM

ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.

చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ

  • ఉమ్మడిగా పరిష్కరించే అంశాలపై చర్చ

అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వీరిరువురూ సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలను భేటీలో ప్రస్తావించారు. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీరు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తుమ్మల అభిప్రాయపడ్డారు. చంద్రబాబును కలిసిన అనంతరం తుమ్మల విలేకరులతో మట్లాడుతూ.. సరిహద్దులోని ఖమ్మం జిల్లాకు చెందిన రహదారులు, రైల్వేలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై సీఎం చంద్రబాబుతో మాట్లాడానని తెలిపారు. పోలవరం కోసం ఏడు మండలాలు ఏపీకి బదిలీ చేశారని, ఇప్పుడు భద్రాచలం నుంచి తెలంగాణకు వెళ్లాలి అంటే ఐదు ఏపీ గ్రామాల మీదుగా వెళ్లాల్సి వస్తోందని, వాటిని తెలంగాణలో తిరిగి కలపాలని కోరామని చెప్పారు. తిరుమలలో తెలంగాణ భవన్‌ నిర్మాణం కోసం 5 ఎకరాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. తన ప్రతిపాదనలు పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. అమరావతి ప్రతిష్టాత్మక రాజధానిగా నిలవాలని కోరుకుంటున్నామన్నారు.

Updated Date - Feb 17 , 2026 | 05:31 AM