కార్మిక సంక్షేమ పథకాల పునరుద్ధరణ
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:44 AM
అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణకు చర్యలు
తద్వారా ఆదాయాలు గణనీయంగా పెరగాలి
అసంఘటిత రంగ కార్మికులను మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లుగా ప్రోత్సహించాలి
కార్మిక శాఖపై సమీక్షలో సీఎం ఆదేశాలు
అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రసూతికి రూ.20 వేలు, వివాహానికి రూ.40 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. కార్మిక శాఖపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల్లో ఆధునిక నైపుణ్యాలు, జీవన ప్రమాణాలను పెంచే అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీలు ఎల్ అండ్ టి, ఎన్‌సీసీ, మిట్టల్ సహా వివిధ సంస్థల సహకారంతో వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆధునిక నైపుణ్య శిక్షణ ద్వారా రాష్ట్రంలోని కార్మికులు దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొంది, అధిక ఆదాయం ఆర్జించేలా చూడాలన్నారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఈ డేటాబే్‌సను అనుసంధానించడంతో పాటు కార్మికులు లేటరల్ ఎంట్రీ ద్వారా వివిధ కోర్సులు అభ్యసించి ఉన్నత విద్యార్హతను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిగ్ వర్కర్లు, నిర్మాణ రంగ కార్మికుల ఆదాయాలు పెరిగేలా చూడాలన్నారు. ఆధునిక పనిముట్లను కార్మికులకు అందించాలన్నారు. నైపుణ్యాలు పెరిగితే అధిక ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచేందుకు అనువుగా కార్యాచరణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న భారీ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కూడా మన యువతకు అవసరమన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులను మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లుగా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించాలని, యూనివర్సల్ హెల్త్ పాలసీతోపాటు కార్మిక శాఖ ద్వారా రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలు, ఆపై ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ద్వారా భరించేలా చూడాలని స్పష్టం చేశారు.
నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
రైతులకు పట్టాదారు పుస్తకాల పంపిణీ
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం ఉదయం 11:30 సమయంలో గ్రామసభలో, రైతులతో ముఖాముఖి, టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రైతులు సాగు చేసిన సజ్జ, బెండ పంటలను పరిశీలిస్తారు. అక్కడే రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఆ తరువాత కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం 4:20 గంటలకు తిరుగుప్రయాణం అవుతారు.