Share News

శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు

ABN , Publish Date - Feb 02 , 2026 | 05:29 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల పర్యటన ముగించుకున్న ఆయన..

శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు

  • కల్తీ నెయ్యిపై ఎన్‌డీడీబీ నివేదిక వచ్చాకే మాట్లాడా: సీఎం

  • జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పాను

  • నానా యాగీ చేసి సుప్రీంకు వెళ్లారు

  • సుప్రీంకోర్టు సిట్‌ వేస్తే.. నేను క్షమాపణలు చెప్పాలట!

  • తిరుమలలో మహాపాపం చేసి..కప్పిపుచ్చుకోవడానికి నాపైనే తిరిగి దాడి

  • వేంకటేశ్వరుడు మా ఇంటి దైవం

  • నేనెప్పుడూ సామాన్య భక్తుడినే

  • ఏనాడూ మహాద్వారం గుండా వెళ్లలేదు

  • కుప్పంలో మీడియాతో చంద్రబాబు

కుప్పం/శాంతిపురం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల పర్యటన ముగించుకున్న ఆయన.. చివరి రోజు ఆదివారం కుప్పంలో మీడియాతో మాట్లాడారు. ‘తిరుమల పవిత్రతను కాపాడి, ప్రక్షాళన చేసేందుకు శ్యామలరావును ఈవోగా పంపాం. అప్పుడే ఆయన నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) నివేదిక అడిగారు. కల్తీ నెయ్యిపై దాని నివేదిక వచ్చాకే మాట్లాడాను. జంతు కొవ్వులు ఉన్నాయని, కల్తీ చేశారని అప్పుడే చెప్పాను. నేను మాట్లాడాక నానా యాగీ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. కల్తీ నెయ్యి ఘటనలో దర్యాప్తు కోసం సిట్‌ వేస్తే.. నేను క్షమాపణలు చెప్పాలంటున్నారు. వాళ్లను ఏమనాలి? వైసీపీ నేతల ప్రవర్తనకు ఇదొక ఉదాహరణ. తిరుమలలో అపచారం, మహాపాపం చేసి.. దానిని కప్పిపుచ్చుకోవడానికి నాపైనే తిరిగి దాడి చేస్తున్నారు. వాళ్ల చర్యలు స్వామిని బజారుకీడ్చేలా ఉన్నాయి. శ్రీవారు మా ఇంటి దైవం. నేను నమ్మి ఆరాధించే దైవం. ఆ స్వామి దగ్గర నేను సామాన్య భక్తుడినే. మహాద్వారం గుండా వెళ్లి శ్రీవారిని ఎప్పుడూ దర్శించుకోలేదు. ఆయనతో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు’ అని స్పష్టం చేశారు.


టెక్నాలజీని సమర్థంగా వాడాలి..

టీడీపీ శ్రేణులకు, తనకు దూరం చెరగాలంటే టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆదివారం తుమ్మిశి వద్ద నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కనీసం ఐటీడీపీ యాప్‌ను కూడా చాలామంది డౌన్‌లోడ్‌ చేసుకోవడం లేదు. అదేమంటే సాకులు చెబుతున్నారు’ అని అసహనం వ్యక్తం చేశారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ తెస్తే అదెంతమంది ఉపయోగించుకుంటున్నారో చేతులు ఎత్తాలని అడిగారు. స్పందన చూసిన తర్వాత.. చాలా తక్కువ మందే టెక్నాలజీ వినియోగిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. టెక్నాలజీని మీరే సరిగా వినియోగించుకోలేకపోతే, ఇక పార్టీ శ్రేణులకు ఏం చెబుతారని వేదికపై కూర్చున్న నాయకులను నిలదీశారు. టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ గురించి 19-20 సార్లు శిక్షణ ఇస్తే ఎంతమంది వచ్చారని ప్రశ్నించారు. ఫోన్‌ను సమర్థంగా వినియోగిస్తే కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉండదన్నారు. ‘2028 నాటికి నా రాజకీయ జీవితం 50 ఏళ్లకు చేరుకుంటుంది. అభివృద్ధికి పునాదులు వేసింది, వేసేది టీడీపీనే. ప్రజల భవిష్యత్‌ కోసం, సంక్షేమం కోసమే నా ఆలోచనలు’ అని భావోద్వేగంతో ప్రకటించారు. పార్టీని బలోపేతంం చేసిన వాళ్లను వెతుక్కొచ్చి దండ వేసి గౌరవిస్తానని ఆయన అన్నారు. నిర్మొహమాటంగా మాట్లాడతానని.. వాస్తవాలు చెబుతానని.. తప్పులు సరిచేసుకోమని సూచిస్తానని.. అప్పటికీ మారకుంటే నమస్కారం పెడతానని చెప్పారు. లోకేశ్‌ కుప్పంనుంచి యువగళం ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తయారు చేసిన పాట సీడీని సీఎం ఆవిష్కరించారు. తుమ్మిశిలో గుండెపోటుతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ.3 లక్షల సాయం ప్రకటించారు.

Updated Date - Feb 02 , 2026 | 05:30 AM