పోలవరం రెండో దశకు 32 వేల కోట్లివ్వండి
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:03 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాధాన్య నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆర్థికంగా సాయపడాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
నల్లమలసాగర్‌కు అనుమతులివ్వండి.. జలశక్తి మంత్రికి చంద్రబాబు అభ్యర్థన
అమరావతి/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాధాన్య నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆర్థికంగా సాయపడాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈమేరకు ఆయనకు వినతిపత్రం అందించారు. ఢిల్లీ పర్యటనలో తొలుత ఆయనతోనే సమావేశమయ్యారు. పోలవరం రెండో దశ నిర్మాణ, భూసేకరణ, సహాయ పునరావాసానికి రూ.32 వేల కోట్లు ఇవ్వాలని అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతుల్లేవంటూ ఇచ్చిన స్టాప్‌వర్క్ ఆర్డర్‌కు ఏడాదికో.. రెండేళ్లకో మినహాయింపులు ఇవ్వడం మామూలైపోయిందని.. ఇలా కాదని.. శాశ్వతంగా నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తయి రెండో దశలోకి రానున్న తరుణంలో.. శాశ్వతంగా స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను ఎత్తివేయడం వల్ల పోలవరం ప్రాజెక్టు ఫలాలు రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు అందుతాయని వివరించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంచడం కారణంగా అయిన అదనపు వ్యయాన్ని రాష్ట్రానికి రీయింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు చర్యలు చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎత్తు పెంపుతో ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాల ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య గోదావరి జలాలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో వివాద పరిష్కారానికి ప్రత్యేకంగా ట్రైబ్యునల్‌ను నియమించాలని కోరారు. నదుల అనుసంధాన విధానంలో భాగంగా.. వృధాగా కడలిపాలవుతున్న గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించేందుకు తలపెట్టిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు పనులకు సాంకేతిక, పర్యావరణ అనుమతులు మంజూరు చేయడంతో పాటు ఆర్థిక సహకారం కూడా అందించాలని పాటిల్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదానికి సంబంధించి సంబంధిత ట్రైబ్యునల్ జారీచేసిన తుది ఆదేశాలను గెజిట్‌లో ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. దీనివల్ల వంశధార నదిపై నిర్మాణాలు పూర్తవుతాయని పేర్కొన్నారు.