Share News

బనకచర్ల పీఎఫ్ఆర్‌ ఆమోదానికి.. కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం!

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:45 AM

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎఫ్ఆర్‌)ను ఆమోదించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

బనకచర్ల పీఎఫ్ఆర్‌ ఆమోదానికి.. కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం!

  • మరోసారి లేఖ రాద్దాం.. సిద్ధం చేయండి

  • తొలి దశలో ‘నల్లమలసాగర్‌’ ప్రారంభిద్దాం

  • పోలవరం పనుల నాణ్యతపై ఒక్క మాటా రానివ్వొద్దు

  • వెలిగొండ కాలువల నిర్మాణానికి నిధులు

  • హంద్రీ-నీవా నీరు అడవిపల్లి దాకా

  • ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం

  • ఉత్తరాంధ్రలోని 11 పథకాలూ పూర్తి చేద్దాం

  • జలవనరుల శాఖకు చంద్రబాబు నిర్దేశం

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్‌)ను ఆమోదించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ రిపోర్టుకు ఆమోదం లభిస్తే.. పర్యావరణ అనుమతి (ఈసీ) లభిస్తుందని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలోని తన కార్యాలయంలో జల వనరుల శాఖపై ఆయన సమీక్ష జరిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాజమౌళి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, మరికొందరు చీఫ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు. బనకచర్ల ప్రాజెక్టు పీఎ్‌ఫఆర్‌కు సంబంధించి కేంద్రానికి అవసరమైన అన్ని నివేదికలూ పంపామని.. ఇంకా కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలసంఘం ఆమోదం ఇవ్వడం లేదని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఒత్తిడి పెంచితే తప్ప కేంద్రం ఆమోదం దక్కదని ఆయన చెప్పారు. పీఎ్‌ఫఆర్‌కు ఆమోదం లభిస్తే.. తొలిదశ కింద నల్లమలసాగర్‌ వరకు ప్రాజెక్టు చేపడదామని ఆయన స్పష్టం చేశారు. మరోసారి కేంద్రానికి లేఖ రాయాలని జల వనరుల శాఖను ఆదేశించారు. తాను ఢిల్లీ వెళ్తున్నానని.. లేఖను సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు.


పోలవరంలో సాంకేతిక లోపాలు రాకూడదు..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతికంగా ఎలాంటి లోపాలూ లేకుండా చూసుకోవాలని ఈఎన్‌సీ నరసింహమూర్తికి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ (పీవోఈ) వెలిబుచ్చిన అభిప్రాయంపై వస్తున్న విమర్శలను ప్రస్తావించారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడడం లేదని, పీవోఈ లేవనెత్తిన అంశం సాంకేతికంగా చాలా చిన్నదని.. ఇది సహజమని కూడా ఈఎన్‌సీ చెప్పారు. అయినప్పటికీ.. పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాలతోనే డయాఫ్రం వాల్‌ నిర్మాణం జరిగిందని అధికారులు వివరించారు. పీవోఈ ఇంకా పూర్తి స్థాయి నివేదికను పంపలేదని జల వనరుల శాఖ అధికారులు వివరించారు. నాణ్యతలో రాజీపడవద్దని.. చిన్నమాట కూడా రాకుండా చూసుకోవాలని సీఎం తేల్చిచెప్పారు.

వెలిగొండ నిధులపై వివరాలివ్వండి..

వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను మూడు నెలల్లో పూర్తి చేస్తున్నందున.. ప్రధాన కాలువల్లోకి నీరు వెళ్లేందుకు అవసరమయ్యే పనులకు కావలసిన నిధుల వివరాలు ఇవ్వాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. భూసేకరణకు అధిక ప్రాధాన్యమిద్దామన్నారు. ప్రాధాన్య క్రమంలో పథకాలను పూర్తిచేద్దామని తెలిపారు. ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టులనూ ఈ టర్మ్‌లోనే పూర్తి చేద్దామన్నారు. అయితే ఏ ప్రాజెక్టు ముందు చేపట్టాలో స్పష్టతకు రావాలని సూచించారు. తారకరామతీర్థసాగర్‌కు తానే శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. తానే పూర్తి చేసి, ప్రారంభిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వరికెలపూడిశెల ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. హంద్రీ-నీవా జలాలను అడవిపల్లి దాకా తీసుకెళ్లేలా పనులు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Updated Date - Mar 07 , 2026 | 04:46 AM