Share News

నీటి ఎద్దడి రావొద్దు

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:35 AM

మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన వివిధ అంశాలపై ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.

నీటి ఎద్దడి రావొద్దు

  • వేసవిలో ముందస్తు చర్యలు తీసుకోండి

  • హాస్టల్‌ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలొస్తే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత

  • అంగన్‌వాడీల్లో పోషకాహారం

  • సంజీవని ద్వారా జూలై నాటికి 66 లక్షల మందికి హెల్త్‌ స్ర్కీనింగ్‌

  • 5 లక్షల మంది హాస్టల్‌ విద్యార్థులకూ

  • 12వ తరగతి వరకు 70 లక్షల మంది విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్స్‌ రూపొందించాలి

  • టెన్త్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌

  • మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే: చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన వివిధ అంశాలపై ప్రభుత్వ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పాలసీల అమలు క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతోందో ప్రత్యక్షంగా చూడాలని సూచించారు. పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో పాలసీలు అమలుకానప్పుడు ఫలితం ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. తరచూ క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ వర్గాల ప్రజలతో అధికారులు మాట్లాడితే చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని చెప్పారు. పీ-4 రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రత్యేక కార్యక్రమమన్నారు. మార్గదర్శులు, బంగారు మిత్రలను నియమించుకోవాలన్నారు. గత పాలకులు చేసిన అప్పుల కారణంగా 14 శాతం వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. ఏపీ క్రెడిట్‌ రేటింగ్‌ పెంచుకుని వడ్డీ తగ్గించుకునేలా రుణాల రీషెడ్యూల్‌ చేస్తున్నామని చెప్పారు. జీతాల చెల్లింపులను గాడిలో పెట్టామన్నారు. అల్లూరి జిల్లా లంబసింగిలో కుంకుమపువ్వు ఉత్పత్తికి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు కశ్మీర్‌లో మాత్రమే కుంకుమపువ్వు ఉత్పత్తి జరుగుతోందన్నారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏలూరు సమీపంలో కోకో సిటీ కూడా ఏర్పాటవుతోందన్నారు. కాఫీ సాగు పెంచడంతో పాటు అరకు కాఫీ బ్రాండ్‌ ప్రమోట్‌ చేస్తున్నామన్నారు.


నీటి నిల్వలు పెరగాలి

‘‘రాష్ట్రంలో 38,608 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు ఉన్నాయి. మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల వద్ద నీటి నిల్వలకు అనుగుణంగా ప్రణాళికలు చేయాలి. చెరువులు, కాల్వలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలి. డీసిల్టింగ్‌, అటవీ ప్రాంతాల్లో ట్రెంచ్‌లను తవ్వాలి. భూగర్భ నీటి నిల్వలు పెరిగితే పర్యావరణపరంగా మంచిది. విద్యుత్‌ కూడా ఆదా అవుతుంది. నీటి బ్యాంకు తరహాలో భూగర్భజలాలు వినియోగం జరగాలి. పారిశ్రామిక కాలుష్యం ద్వారా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడాలి. సురక్షితమైన తాగునీరు ప్రజలకు అందాలి. బోర్ల నుంచి కలుషిత నీరు రావడానికి వీల్లేకుండా చూడాలి. ఆశ్రమ బాలుర హాస్టళ్లలో కలుషిత నీరు కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన పరిస్థితి ఎదురైంది. ఈ తరహా ఘటనలు రాష్ట్రంలో ఉత్పన్నం కాకూడదు. ఇలాంటి సంఘటనలు జరిగితే దానికి సంబంధిత జిల్లా కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ మంత్రులదే బాధ్యత. త్వరలో వేసవి రాబోతోంది. నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి నుంచే వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తాగునీటికి ఇబ్బంది రాకుండా చూసుకోవడంతో పాటు పశువుల దాణాకూ ఇబ్బంది రాకూడదు. పంచాయతీరాజ్‌ రోడ్లు, నీటిసంరక్షణ చర్యలు, గోకుల షెడ్లు, మ్యాజిక్‌ డ్రెయిన్లు చేపట్టాలి. జీ రామ్‌జీ పనులపై కార్యాచరణ సిద్ధం చేయండి’’ అని సీఎం ఆదేశించారు.


హెల్త్‌ స్క్రీనింగ్

‘‘సంజీవని ద్వారా జూలై నాటికి 66 లక్షల హైరిస్క్‌ కేసుల హెల్త్‌ స్క్రీనింగ్ చేయాలి. 5 లక్షల మంది హాస్టల్‌ విద్యార్థులకు స్ర్కీనింగ్‌ చేయాలి. 12వ తరగతి వరకు ఉన్న 70 లక్షల మంది విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్స్‌ కూడా తయారు చేయాలి. కేర్‌ అండ్‌ గ్రో ద్వారా మాతా శిశు ఆరోగ్యం, పెరుగుదలను నమోదు చేయాలి. పౌష్టికాహారంతో పాటు అవసరమైన సప్లిమెంట్స్‌ అందించేలా చర్యలు తీసుకోవాలి. అవిశ, మునగ, రకరకాల ఆకుకూరల్లో పౌష్టికాహారం లభిస్తుంది. మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీలలో పౌష్టికాహారాన్ని అందించేలా కార్యాచరణ ఉండాలి. వీలుంటే అన్న క్యాంటీన్లలో కూడా పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇక నార్మల్‌ డెలివరీలు పెరిగేలా చూడాలి. సిజేరియన్‌ ఆపరేషన్లు తగ్గాలి. వచ్చే ఏడాది ఎయిడ్స్‌ ఫ్రీ ఏపీగా డిక్లేర్‌ చేస్తాం. ఫ్యామిలీ కార్డు బెనిఫిట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా జూన్‌ నాటికి సమగ్రమైన ఓ కార్డు జారీ చేస్తాం. మార్చి నాటికి పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు చెప్పారు.


ఒత్తిడి లేని విద్యాబోధన లక్ష్యం

‘‘పదోతరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలి. పరీక్షలు అంటే.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేలా ఈ కార్యాచరణలో భాగం చేయాలి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వీల్లేదు. ఒత్తిడి లేని విద్యా విధానంతోనే కొత్త ఆలోచనలొస్తాయి. ఇన్నోవేషన్లకు ఆస్కారముంటుంది. విద్యా వ్యవస్థలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వయోజన విద్యలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా డ్వాక్రా మహిళల సహకారం తీసుకోవాలి. లేటరల్‌ ఎంట్రీ ఉండేలా యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో చర్యలు చేపట్టాలి. ఎలక్ట్రీషియన్‌, కార్పెంటర్‌ వంటి వారు ఉన్నత విద్యను అభ్యసించి సర్టిఫికెట్లు పొందేలా కార్యాచరణ ఉండాలి. కేంద్రం అమలు చేస్తున్న కర్మయోగి పథకంలో ఏపీకి చెందిన వారే అగ్రస్థానంలో ఉన్నారు. నైపుణ్య కల్పనలో భాగంగా ఐటీఐలు, కళాశాలల్లో కాన్వకేషన్లు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలి. నైపుణ్యం పోర్టల్‌ ద్వారా స్కిల్లింగ్‌తో పాటు ఉద్యోగాలు ఏ మేరకు వస్తున్నాయనే అంశాన్ని పర్యవేక్షించాలి. నైపుణ్యాభివృద్ధి రంగాన్ని మరింత బలోపేతం చేయాలి’’ అని చంద్రబాబు సూచించారు.


నదుల అనుసంధానంతో రాష్ట్రానికి పుష్కలంగా జలాలు: సీఎం

జల భద్రతపై జలవనరుల శాఖ ప్రజంటేషన్‌

అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): నదుల అనుసంధానంతో రాష్ట్రానికి పుష్కలంగా జలాలు అందించేలా కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని జల వనరుల శాఖ, జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. సోమవారం మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమీక్షలో ‘జల భద్రత’పై ప్రత్యేక చర్చ చేపట్టారు. ఈ చర్చలో మంత్రి నిమ్మల రామానాయుడు, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, ప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆ శాఖ ‘జల భద్రత’పై ప్రజంటేషన్‌ ఇచ్చింది. కేంద్ర జల సంఘానికి పంపిన పోలవరం-బనకచర్ల పీఎ్‌ఫఆర్‌కు ఈ నెలాఖరులోగా ఆమోదం పొందాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నామన్న జలవనరుల శాఖ... ఆ ప్రాజెక్టుకు వివిధ అనుమతులు పొందడానికి పెట్టుకున్న లక్ష్యాలనూ వివరించింది. ‘72 శాతం పూర్తిచేసిన వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాది జూన్‌ నాటికే పూర్తిచేయాలని భావిస్తున్నాం. పొలవరం ప్రాజెక్టు పనులు 86 శాతం దాకా పూర్తయినందున.. మిగిలిన 14శాతం పనులను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేయాలని నిర్ణయించాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు నీరందించే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు 87శాతం పూర్తయ్యాయి. అలాగే ఉత్తరాంధ్రలోని 11ప్రాజెక్టులను, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువలో మిగిలిన 400.50 కిలోమీటర్ల పనులను ఇప్పటికే చేపట్టాం. కల్యాణి డ్యామ్‌ వరకూ కృష్ణా జలాలను తరలించాలని నిర్ణయించాం. వంశధార-నాగావళి అనుసంధాన పథకం, నాగావళి-చంపావతి అనుసంధానం, పోలవరం-ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాల పూర్తికి ప్రణాళికను రూపొందించాం. మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులన్నీ నింపేలా కార్యాచరణను సిద్ధం చేశాం’ అని జల వనరుల శాఖ పేర్కొంది.

Updated Date - Feb 10 , 2026 | 03:37 AM