Share News

పోటీ పడాల్సింది అభివృద్ధిలో

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:58 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏదిపడితే అది మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించడం తగదన్నారు.

పోటీ పడాల్సింది అభివృద్ధిలో

  • పవన్‌పై టీ-నేతల వ్యాఖ్యలు సరికాదు

  • ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు

  • ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం ఇంకానా?

  • అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలోనూ తెలుగువారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు

  • ప్రజల మధ్య విభేదాలు తేవడం సరికాదు

  • మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు

అమరావతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు. ఏదిపడితే అది మాట్లాడి లేనిపోని సమస్యలు సృష్టించడం తగదన్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. తెలంగాణలో పవన్‌ సభకు అనుమతి ఇవ్వకపోవడం, ఆయనపై తెలంగాణ నాయకులు విమర్శలు చేయడంపై సీఎం స్పందించారు. విభజన జరిగి 12 ఏళ్లయిందని, ఇప్పుడు కొందరు తెలంగాణ నాయకులు విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటే సాధ్యం కాదని అన్నారు. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. తాను తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లానని, అక్కడికి ప్రస్తుత కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ కూడా వచ్చారని, ఎవరూ ఎవరినీ నియంత్రించలేరని అన్నారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో పాటు బీఆర్‌ఎస్‌ ఉంది. బీఆర్‌ఎస్‌ కూడా నేషనల్‌ పార్టీనే కదా. ఏపీలో శాఖలు కూడా పెట్టారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలో తెలుగువారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. అక్కడ ఉండే రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారు. అభివృద్ధి, ప్రజాసేవలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలి కానీ ప్రజల మధ్య విభేదాలు తేవడం సరికాదు. రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలి. అనవసరంగా వివాదాలు సృష్టించడం ఎవరికీ మంచిది కాదు’’ అని సీఎం అన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 07:22 AM