Share News

అగ్నిమాపక శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:02 AM

దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

అగ్నిమాపక శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

  • అధునాతన ఫైర్‌ టెండర్‌ వాహనాలు, పరికరాలను ప్రారంభించిన సీఎం

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ర్టాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అమరావతి పరేడ్‌ గ్రౌండ్‌లో అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. రూ.252.93 కోట్లతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రూ.18 కోట్లతో తొలిదశలో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు, రూ.10 కోట్లతో హై ప్రెషర్‌ పంప్‌లు కలిగిన 40 క్విక్‌ రెస్పాన్స్‌ వాహనాలు, రూ.2.49 కోట్లతో 50 ఇన్‌ ఫ్లేటబుల్‌ రబ్బర్‌ బోట్లు, రూ.2.08 కోట్లతో 30 బీఏ సెట్‌ కంప్రెసర్లను కొనుగోలు చేసింది. ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం, వాటి గురించి సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించుకున్నందుకు అధికారులను అభినందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాజధాని అమరావతితో పాటు ప్రధాన నగరాల్లో హై రైజ్డ్‌ బిల్డింగ్‌లు నిర్మాణం అవుతున్నాయని, వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌, అగ్నిమాపక శాఖ డీజీ పీవీ రమణ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌, పలువురు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

3.jpg

Updated Date - Apr 08 , 2026 | 04:02 AM