Share News

‘రాజకీయ మీడియా’తో ముప్పు

ABN , Publish Date - Mar 29 , 2026 | 05:32 AM

పత్రికలు సమాజం కోసం పాటు పడే రోజుల నుంచి రాజకీయ పార్టీలు సొంత మీడియా ఏర్పాటు చేసుకుని సమాజానికి హాని చేసే రోజులు వచ్చాయని...

‘రాజకీయ మీడియా’తో ముప్పు

  • స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా తప్పుడు ప్రచారం

  • ఐజేయూ ప్లీనరీలో సీఎం చంద్రబాబు

అమరావతి, విజయవాడ అర్బన్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): పత్రికలు సమాజం కోసం పాటు పడే రోజుల నుంచి రాజకీయ పార్టీలు సొంత మీడియా ఏర్పాటు చేసుకుని సమాజానికి హాని చేసే రోజులు వచ్చాయని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పాత్రికేయులు మంచిని, అభివృద్ధిని ప్రమోట్‌ చేస్తూ.. మారిన స్వార్థ మీడియా పోకడలకు చెక్‌ పెట్టాలని చెప్పారు. విజయవాడలో శనివారం జరిగిన ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌(ఐజేయూ) ప్లీనరీకి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ఒకప్పుడు పత్రికలు సమాజం కోసమే వార్తలు రాసేవి. పాత్రికేయులు వృత్తి పరమైన విలువలు పాటించేవారు. రాజకీయ మనుగడ కోసం మీడియా సంస్థను ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు సమాజానికి హాని కలిగిస్తున్నారు..పాత్రికేయులు నిక్కచ్చి వార్తలతో ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలి’ అని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా అతిపెద్ద సవాలుగా మారిందని, తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేయడంతో పాటు అసభ్యకరమైన కంటెంట్‌తో సమాజాన్ని కలుషితం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయన్నారు.


ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోన్న సోషల్‌ మీడియా కంటెంట్‌ కట్టడికి ప్రొఫెషనల్‌ పాత్రికేయులు నడుం బిగించాలన్నారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం చూస్తుందని, రాష్ట్రాభివృద్ధికి ప్రోగ్రెసివ్‌ వార్తలతో సహకరించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని చెప్పారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే పాత్రికేయుల సంక్షేమానికి బీజం పడిందన్నారు. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ, వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ చట్టాన్ని పునరుద్ధరించాలని, కొత్త వేజ్‌బోర్డు ఏర్పాటుతోపాటు మీడియా స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు కొత్త చట్టాలు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ప్రధాన కార్యదర్శి బల్విందర్‌ సింగ్‌ జమ్ము మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల పరిస్థితి దిగజారుతోందని, దాడులు, హత్యల వంటి ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల హామీ అమలు చేయాలని, పాత్రికేయుల ప్రమాద బీమా పునరుద్ధరించాలని, పదవీ విరమణ చేసిన పాత్రికేయులకు పెన్షన్‌ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఏపీ ప్రెస్‌ అకాడమీ చైౖర్మన్‌ ఆలపాటి సురేశ్‌, మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీలు కృష్ణదేవరాయలు, కేశినేని శివనాథ్‌, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బొండా ఉమా, విశాలాంధ్ర ఎడిటర్‌ ఆర్వీ రామారావు మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు.

Updated Date - Mar 29 , 2026 | 05:33 AM