Eros Innovations Chairman: చంద్రబాబు దావోస్ మ్యాన్
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:49 AM
దావోస్ మ్యాన్ చంద్రబాబు అంటూ ఈరోస్ ఇన్నోవేషన్స్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కిశోర్ లుల్లా ప్రశంసలు గుప్పించారు.
ఈరోస్ సంస్థ చైర్మన్ కిశోర్ లుల్లా ప్రశంసలు
ఏఐ క్రియేటివ్ టెక్ హబ్‌కు అపార అవకాశాలు
ఈరోస్ ఇన్నోవేషన్స్‌ను రాష్ట్రానికి ఆహ్వానించిన సీఎం
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): దావోస్ మ్యాన్ చంద్రబాబు అంటూ ఈరోస్ ఇన్నోవేషన్స్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కిశోర్ లుల్లా ప్రశంసలు గుప్పించారు. దావోస్ పర్యటనలో భాగంగా సోమవారం నాడు జ్యూరిక్‌లో కిశోర్ లుల్లాతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని కృత్రిమ మేధో ఆధారిత సృజనాత్మక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. ఏఐ క్రియేటివ్ టెక్ హబ్ జనరేటివ్ ఏఐ డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై లుల్లాకు సీఎం వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా డిజిటల్ మీడియా, వర్చువల్ ప్రొడక్షన్, గేమింగ్, యానిమేషన్, ఫిలిం ప్రొడక్షన్, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఈ భేటీలో ఈరోస్ సహ వ్యవస్థాపక అధ్యక్షుడు రిధిమా లుల్లా, కో ప్రెసిడెంట్ స్వనీత్ సింగ్ పాల్గొన్నారు. ఈరోస్ జెన్ ఏఐ, ఈరోస్ యూనివర్స్, వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలను గురించి ఈరోస్ ప్రతినిధులు వివరించారు. ‘‘డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360’’ పేరుతో రియాలిటీ ప్రచారం కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నట్లుగా ఈరోస్ ప్రతినిధులు వివరించారు..