దద్దోజనం తిని కూర్చోవడం కాదు!
ABN , Publish Date - May 02 , 2026 | 04:20 AM
ఎన్నికల్లో కష్టపడి పనిచేసేది పార్టీ క్యాడరే.. వారిని పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే ఉపేక్షించే ప్రశ్నే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పార్టీ క్యాడర్‌నూ పట్టించుకోండి
ఎన్నికల్లో కష్టపడేది వారే.. వారిని విస్మరిస్తే ఎలా?
పామర్రు సమావేశంలో ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి
అమరావతి/మచిలీపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో కష్టపడి పనిచేసేది పార్టీ క్యాడరే.. వారిని పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే ఉపేక్షించే ప్రశ్నే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కపిలేశ్వరపురంలో ఆ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలను, నాయకులను విస్మరిస్తే గత పాలకులకు పట్టిన గతే మనకూ పడుతుందన్నారు. ఒక దశలో.. దద్దోజనం తిని కూర్చోవడం కాదు.. పార్టీ క్యాడర్‌నూ కాస్త పట్టించుకోండంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేవలం ఎమ్మెల్యే కుటుంబమే బాగుంటే సరిపోదని, పార్టీ కోసం పనిచేసిన వారి కుటుంబాలూ బాగుండాలని.. అప్పుడే పార్టీ బాగుంటుందన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధిని, పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది క్యాడరేనని, ఎన్నికల్లో ఓటర్లను బూత్‌ల దగ్గరకు తీసుకొచ్చేదీ వారేనని అలాంటి కార్యకర్తలను విస్మరించిన ఏ పార్టీ మనుగడ సాగించిన దాఖలాల్లేవని స్పష్టం చేశారు. ఇది ఒక్క పామర్రు ఎమ్మెల్యేను మాత్రమే దృష్టిలో పెట్టుకుని చెబుతున్న విషయం కాదని.. జిల్లాలోని ఎమ్మెల్యేలందరికీ వర్తిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో జరిగే పనులన్నీ వారి కుటుంబసభ్యుల పేరుతో చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఇటీవల అధిష్ఠానం దృష్టికి వెళ్లాయి. ఎమ్మెల్యేలు క్యాడర్‌ను పూర్తిగా విస్మరించారని, ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక ఎన్నికల్లో నెగ్గుకురాలేమని పలువురు పార్టీ నాయకులు టీడీపీ పెద్దలకు చెప్పారు. వాటిని దృష్టిలో పెట్టుకుని తాజాగా సీఎం ఎమ్మెల్యేల పనితీరును కార్యకర్తల సమక్షంలోనే ఎండగట్టారు. ఎమ్మెల్యే కుమార్‌రాజా పనితీరు 80 శాతం బాగుందని, మిగిలిన 20శాతం కూడా మెరుగుపరచుకోవాలని సూచించారు.

ముగ్గురికి బెస్ట్ మేనేజ్‌మెంట్, నలుగురికి శ్రమశక్తి అవార్డులు
పమిడిముక్కల సభలో ముఖ్యమంత్రి ముగ్గురికి బెస్ట్‌మేనేజ్‌మెంట్ అవార్డులు,నలుగురికి శ్రమశక్తి అవార్డులు అందజేశారు.
బెస్ట్ మేనేజ్‌మెంట్: కె.సుమంత్ (కృష్ణా జిల్లా, పెదఅవుటపల్లి),వి.వెంకట్ (కురుమద్దాలి) కె.అప్పారావు(ఒంగోలు)
శ్రమశక్తి: పి.పోతురాజు (ఎన్టీఆర్ జిల్లా, జయంతిపురం) కె.రామకృష్ణ (బాపట్ల జిల్లా, చీరాల), పిల్లా జ్యోతి (కృష్ణాజిల్లా, బొమ్ములూరు), ఎం.రవికుమార్ (కర్నూలు జిల్లా, ఒంటిపర్ల)