Share News

మర్యాదగా చెబితే వినరా?

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:46 AM

‘‘మర్యాదగా చెబితే వినరా మీరు? అటవీశాఖ అధికారుల వైఖరి చాలా చాలా అభ్యంతరకరంగా ఉంది. శ్రీశైలం ఆలయానికి భక్తులను కూడా రాకుండా ఆపేస్తున్నారు.

మర్యాదగా చెబితే వినరా?

  • అటవీ అధికారులపై చంద్రబాబు ఫైర్‌

  • నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నా

  • ఫారెస్ట్‌పై ఎప్పుడూ ఇన్ని ఫిర్యాదుల్లేవు

  • గిరిజనుల సంక్షేమాన్నే అడ్డుకుంటారా?

  • అటవీ అధికారులపై చంద్రబాబు ఫైర్‌

అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ‘‘మర్యాదగా చెబితే వినరా మీరు? అటవీశాఖ అధికారుల వైఖరి చాలా చాలా అభ్యంతరకరంగా ఉంది. శ్రీశైలం ఆలయానికి భక్తులను కూడా రాకుండా ఆపేస్తున్నారు. బద్వేల్‌లో ఆలయాన్ని తొలగిస్తే, మళ్లీ పునర్నిర్మించాల్సి వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు రోడ్లు, కరెంటు, నీళ్లు ఇవ్వకూడదంటే ఎలా? కలెక్టర్లు చెబుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది సరైన విధానం కాదు. జిల్లాల్లో ఫారెస్ట్‌ అధికారులు (డీఎఫ్‌వోలు) కలెక్టర్ల కిందే పనిచేయాలి. గుర్తుంచుకోండి. నేను నాలుగోసారి సీఎంగా చేస్తున్నాను. అటవీ శాఖపై గతంలో ఎప్పుడూ ఇన్ని ఫిర్యాదులు లేవు. రాష్ట్రంలో అటవీశాఖ ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరం. ఈ అంశంపై ఇప్పటికే ఈ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎంతో (పవన్‌ కల్యాణ్‌) మాట్లాడాను. మళ్లీ మరోసారి మాట్లాడతాను’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రెండోరోజు కలెక్టర్ల సమావేశంలో మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ వాకాటి కరుణ మాట్లాడుతూ, డ్వాక్రా మహిళల సాధికారత కోసం ప్రభుత్వం చేపట్టిన ‘బ్యాంబూ ప్రాజెక్టు’ అమలుకు అటవీశాఖ అనుమతించడం లేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆ వెంటనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని, పార్వతీపురం జిల్లాలో కూడా అటవీశాఖ అనుమతులు రావడం లేదని, దానివల్ల ప్రభుత్వ అభివృద్ధి పథకాలు అమలు చేయడానికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. తమ జిల్లాలో గిరిజనులకు నీటి సరఫరా కోసం కనీసం బోర్లు వేయడానికి కూడా అటవీశాఖ అధికారులు అంగీకరించడం లేదంటూ ఏలూరు జిల్లా కలెక్టరు వెట్రిసెల్వి తెలిపారు. అక్కడే ఉన్న అటవీశాఖ ఉన్నతాధికారులు చెప్పిన కారణాలతో ఏకీభవించని ముఖ్యమంత్రి... ఆ శాఖ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


‘‘పోలీసు విభాగం పీపుల్‌ ్స ఫ్రెండ్లీగా మారిందిగానీ, అటవీ శాఖ మాత్రం ఏ కోశానా స్నేహపూర్వకంగా లేదు. కొందరు అటవీశాఖ అధికారులు ఆచరణాత్మకంగా ఆలోచించకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించనీయకుండా అడ్డుకుంటే ఎలా? నడక దారిలో శ్రీశైలం వస్తున్న భక్తులను అడ్డుకున్నారు. ఆ తర్వాత రోజే అక్కడ తొక్కిసలాట జరిగింది. బద్వేలులోనూ ఇదే తరహాలో వ్యవహరించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ప్రజలను ఇబ్బంది పెట్టేలా, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కల్పించేలా వ్యవహరించకూడదు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు అటవీశాఖ సహకరించాలి. ఆ శాఖ గ్రీన్‌ కవర్‌ (పచ్చదనం) పెంచే అంశంపై దృష్టి పెట్టాలి. జీవ వైవిధ్యాన్ని సాధించాలి. కానీ, అభివృద్ధికి మాత్రం ఆటంకంగా మారకూడదు’’ అని స్పష్టం చేశారు.


  • జూనియర్‌ ఐఏఎస్‌లకు ఆసరా ఇవ్వండి

  • సీనియర్లకు ముఖ్యమంత్రి సూచన

జూనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు ఆసరా (హ్యాండ్‌ హోల్డింగ్‌) ఇచ్చి సహకరించాలని సీఎం చంద్రబాబు సీనియర్‌ ఐఏఎస్‌లను కోరారు. ఏఐ సాయంతో తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు నిర్వహించే వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా పెద్దఎత్తున నూతన ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించిన ఆయన.. వాటిని ప్రజారోగ్యం కోసం వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. తక్కువ వ్యయంతో పోర్టబుల్‌గా ఉండే మెడ్‌ టెక్‌ టూల్స్‌ను తయారు చేయాలని సూచించారు. రూట్‌, రోడ్డు ఆప్టిమైజేషన్‌ కూడా చేసుకుని 108 అంబులెన్సులు అత్యవసర పరిస్థితుల్లో త్వరగా బాధితుల వద్దకు చేరుకునేలా చూడాలని సూచించారు.


  • మున్సిపాలిటీల్లో మిగులు ఆదాయం

  • బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎ్‌సకు లాస్ట్‌ చాన్స్‌: సీఎం

భవిష్యత్‌లో ప్రతి మున్సిపాలిటీ ఆదాయం మిగులులోకి రావాలని సీఎం స్పష్టంచేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వచ్చే ఆదాయం పెరిగి, ఖర్చులు తగ్గాలన్నారు. పట్టణాభివృద్ధిపై కలెక్టర్లకు ఆయన పలు సూచనలు చేశారు. రోడ్లను దశలవారీగా అవుట్‌సోర్సింగ్‌ చేయాలని చెప్పారు. మున్సిపల్‌ బాండ్లకు ఎంతవరకు వెళ్లవచ్చో ప్రణాళిక రూపొందించాలన్నారు. నగరాలు తర్వాతి దశకు ఎదగాలని.. అందుకోసం అవసరమైతే మొత్తం సేవలు అవుట్‌సోర్సింగ్‌ చేయాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీకి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ మాట్లాడుతూ... బీపీఎ్‌సకు 5 లక్షల దరఖాస్తులు వచ్చాయని, తద్వారా రూ.వెయ్యి కోట్ల ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎ్‌సకు 1.12 లక్షల దరఖాస్తులు వచ్చాయని, రూ.1,500 కోట్ల ఆదాయం ఇప్పటికే వచ్చిందని తెలిపారు. అయితే ఈ స్కీంలకు ఇదే చివరి అవకాశమని సీఎం స్పష్టంచేశారు. ఇవి పూర్తయ్యాక డ్రోన్ల ద్వారా మొత్తం రికార్డు చేయాలని నిర్దేశించారు.

Updated Date - Mar 13 , 2026 | 03:48 AM