మార్చినాటికి గ్రామాల్లో 100శాతం చెత్త సేకరణ
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:47 AM
స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కింద చేపడుతున్న వివిధ పనుల ద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థను పునర్నిర్వచిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
వృత్తాకార ఆర్థిక వ్యవస్థను పునర్నిర్వచిస్తున్నాం
వినుకొండలో స్వచ్ఛ రథాలను ప్రారంభించిన సీఎం
గుంటూరు(వినుకొండ), ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కింద చేపడుతున్న వివిధ పనుల ద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థను పునర్నిర్వచిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కింద స్వచ్ఛ రథాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటా చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన పుష్ కార్టులు, ఈ-ఆటోలను కూడా ప్రారంభించారు. మార్చి నాటికల్లా గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం మేర ఇంటింటా చెత్త సేకరణ జరగాల్సిందేనని అధికారులను ఆదేశించారు. గతంలో పాత వస్తువులు తీసుకుని కొత్త వస్తువులు ఇచ్చేవారు. అదే విధానాన్ని తీసుకుని ఇళ్లలో పనికిరాని వస్తువులను స్వచ్ఛ రథాల ద్వారా సేకరించి వారికి అవసరమైన నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల ప్రజలు రోడ్లపై చెత్త పడేయకుండా ఉంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ రథాల విధానాన్ని దశలవారీగా అమలులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతున్నామని, తద్వారా ఇంటి వద్దనే 100 శాతం చెత్తను సేకరించవచ్చన్నారు. వైజాగ్, గుంటూరులో ఉన్న వేస్టు టూ ఎనర్జీ ప్లాంట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయని, కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో మరో ఐదు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్ సిక్స్ పథకాలను నిర్ణీత సమయం కంటే ముందే అమలు చేసి సూపర్‌హిట్ చేశామని చంద్రబాబు అన్నారు. కాగా, పల్నాడు జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని సీఎం పరిశీలించారు.
561 స్వయం సహాక సంఘాలకు రూ.100.14 కోట్ల చెక్కుని సీఎం అందజేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చినట్టే.. వినుకొండను కూడా ఆ హబ్‌లో చేర్చి అభివృద్ధి చేస్తామని సీఎం హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెట్టి పట్టాభి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, సీఎంవో అధికారి ప్రద్యుమ్న, పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు.