Share News

సీమకు నవ శకం

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:11 AM

రాయలసీమకు నవశకం మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్‌ రాకతో ఏపీ ఉక్కు రాష్ట్రంగా అవతరించనున్నదని తెలిపారు.

సీమకు నవ శకం

  • జిందాల్‌ రాకతో మనదిక ఉక్కు రాష్ట్రం: సీఎం

  • గ్రీన్‌ ఎనర్జీతో తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఇదే

  • సీమలోని ఖనిజాలతో ఇక్కడ సంపద సృష్టి

  • రతనాల సీమ చేస్తానని చెప్పా.. అన్నట్టే స్వర్ణగిరి గోల్డ్‌ ఫీల్డ్స్‌కు శ్రీకారం

  • రూ.లక్ష కోట్లతో మదనపల్లెలో గ్లోబల్‌ హార్టీకల్చర్‌ హబ్‌

  • 11.50 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సీమకే రూ.4.58 లక్షల కోట్లు రాక

  • 9 లక్షల ఉద్యోగాల్లో సీమకు 3.50 లక్షలు

  • కడప జిల్లా జమ్మలమడుగులో జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు సీఎం శంకుస్థాపన

  • విజయనగరంలోని జిందాల్‌ ఇండస్ర్టియల్‌ పార్కుకు వర్చువల్‌గా భూమిపూజ

‘‘రాయలసీమ అంటే గుర్తుకొచ్చేవి తిరుమల వేంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట మాత్రమే కాదు. హార్టీకల్చర్‌ అద్భుతాలు, అరుదైన ఖనిజాలూ మదిలో మెదులుతాయి. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్‌ ఫీల్డ్స్‌... రాయలసీమ అంటే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కేంద్రం....కియా మోటర్లు, హీరో బైకులు, డ్రోన్లు, ఫైటర్‌ జెట్లు, ఎలక్ర్టానిక్స్‌, గ్రీన్‌ ఎనర్జీ. స్టీల్‌ ప్లాంట్‌ పనులతో సీమ చరిత్రలో నవశకం మొదలైంది.’’

- సీఎం చంద్రబాబు

కడప, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రాయలసీమకు నవశకం మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జిందాల్‌ స్టీల్‌ ప్లాంట్‌ రాకతో ఏపీ ఉక్కు రాష్ట్రంగా అవతరించనున్నదని తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో శుక్రవారం స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణ పనులను కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, జేఎ్‌సడబ్ల్యూ సంస్థ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో తలపెట్టిన జిందాల్‌ ఇండస్ర్టియల్‌ పార్కు కోసం వర్చువల్‌గా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాయలసీమ చరిత్రలోనే ఇది ఒక మైలురాయి అని, దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అందరి కల ఈరోజు నిజమైందని అన్నారు. ఇక్కడ లభించే ఖనిజ సంపదను ఇక్కడే సంపద సృష్టికి వినియోగిస్తామని ప్రకటించారు. ‘‘జిందాల్‌ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది.


రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను మీ రెండో నివాసం చేసుకుని పెట్టుబడులు పెట్టాలని సజ ్జన్‌ జిందాల్‌ను అడిగాను. ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 1.30 గంటలు అవుతున్నా ఒక్కరు కూడా ఇక్కడ నుంచి కదలలేదు. దీన్నిబట్టి రాయలసీమకు అన్నీ మంచి రోజులేనని తేలిపోతోంది’’ అని చంద్రబాబు అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

సీమ అభివృద్ధి.. నా బాధ్యత..

‘‘స్టీల్‌ ప్లాంట్‌కు జగన్‌ ఆనాడు మోసపూరిత శంకుస్థాపనలు చేశారు. 2019 డిసెంబరులో, 2023లో రెండుసార్లు భూమి పూజ చేశారు. కానీ, ఒక తట్ట మట్టి పోయలేదు. ఒకచిన్న బిల్డింగ్‌ కూడా కట్టలేదు. అన్ని అడ్డంకులూ తొలగించుకొని వచ్చాం. ప్లాంట్‌ నిర్మాణానికి 1100 ఎకరాల భూమి ఇచ్చాం. రెండు దశల్లో రూ.4,500కోట్లు, రూ.11,850కోట్లు...సోలార్‌ ఎనర్జీకి రూ.20,350కోట్లు...మొత్తం కలిసి రూ.36,700కోట్లు ఖర్చు చేయబోతున్నాం. రాయలసీమను అభివృద్ధి చేసి చూపించే బాధ్యత ఈ ప్రాంత బిడ్డగా నాది. విధ్వంసమైన రాష్ట్రానికి మళ్లీ పూర్వవైభవం తేవాలని మోదీ నాయకత్వంలో నేను, పవన్‌కల్యాణ్‌ 2024లో మీ వద్దకు వచ్చాం. మమ్మల్ని మీరు గొప్పగా ఆశీర్వదించారు. ఎన్నో అవాంతరాలు, ఎన్నో అవమానాలు దాటుకొని ఈరోజు రాయలసీమ స్టీల్‌ప్లాంట్‌ పనులు ప్రారంభించుకున్నాం. నాకు స్వార్థం లేదు. రాయలసీమ రాళ్ల సీమ కాదు...రతనాల సీమ అని నిరూపించాలనేదే నా లక్ష్యం. స్టీల్‌ప్లాంట్‌ పూర్తి చేయించి.. ఉద్యోగాలిప్పించే బాధ్యత నాది. రాష్ట్రానికి 11.50 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే, అందులో రూ.4,58,288కోట్ల పెట్టుబడులు రాయలసీమకే వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 9లక్షల మందికి ఉద్యోగాలు రానుండగా, అందులో సీమవాసులకు 3.50లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వేరే ఊరికి వలస పోయే పరిస్థితి ఉండదు.’’


ఓర్‌ మనమిస్తే స్టీల్‌ తయారుచేస్తారు...

‘‘విశాఖ మాత్రమే కాదు, నా రాయలసీమ కూడా ఉక్కు సీమగా తయారవుతుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సంక్షోభంలో పడగా, ప్రధానితో మాట్లాడి రూ.11,480కోట్ల ఆర్థికసాయం తెచ్చాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.1.35లక్షలకోట్ల పెట్టుబడితో మిత్తల్‌ స్టీల్‌ప్లాంట్‌ పెట్టారు. కడపలో జిందాల్‌ ప్లాంట్‌ 2మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో సిద్ధమవుతుంది. సర్కులర్‌ ఎకనామీలో భాగంగా ఉక్కు వేస్ట్‌ను కూడా తీసుకుని మెర్జ్‌ చేస్తారు. గ్రీన్‌ ఎనర్జీతో గ్రీన్‌స్టీల్‌ తయారుచేసే మొదటి ప్లాంటు ఇదే. దీనికి భూమి ఇచ్చాం. గండికోట జలాశయం నుంచి 15 కిమీ పైప్‌లైన్‌ వేసి, రెండు టీఎంసీల నీరు ఇచ్చాం. రాయలసీమలో ఐరన్‌ ఓర్‌ ఉంది.. దానిని వాడుకుని జిందాల్‌ స్టీల్‌ తయారుచేస్తారు. ఆగస్టు 15లోపు రూ. లక్షకోట్లతో గ్లోబల్‌ హార్టీ కల్చర్‌ హబ్‌కు మదనపల్లెలో శంకుస్థాపన చేస్తాం. రూ.40 వేలకోట్లు ప్రభుత్వం పెడితే, రూ.60 వేలకోట్ల విలువైన ప్రైవేట్‌ పెట్టుబడులు వస్తాయి. దేశంలో హార్టీ కల్చర్‌లో మొదటిస్థానంలో ఉన్నాం. ప్రపంచంలోనే నంబర్‌ 1గా ఏపీ అయ్యేలా చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నాం. సీమను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తయారుచేస్తాం. పల్లెలే రేపటి సంపదకు పుట్టిళ్లు. సీమలో ఫ్యాక్షన్‌ పోయింది. స్టీల్‌ప్లాంట్‌ను ఆధారం చేసుకుని చిన్నచిన్న పరిశ్రమలు పెట్టుకోవచ్చు. కడప ప్రాంతంలో రైతులు ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టాలి. వన్‌ ఫ్యామిలీ- వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ కింద వారికి రుణాలు ఇస్తాం. కడప జిల్లాకు 20.5 గిగావాట్ల సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ వస్తోంది. ఈ జిల్లా గ్రీన్‌ హబ్‌గా తయారవుతోంది.’’ అని అన్నారు. తొలుత జేఎ్‌సడబ్ల్యూ ఏర్పాటుచేసిన ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ను, మినియేచర్‌ పనులను.. ప్రకృతి విపత్తులు, డిఫెన్స్‌ అవసరాల కోసం ఉపయోగించే ప్రత్యేక వాహనాన్ని జిందాల్‌తో కలిసి పరిశీలించారు.


2028 జూలై 3.. డేట్‌ రాసి పెట్టుకోండి

‘‘రెండేళ్లలో జేఎస్‌డబ్ల్యూను రాష్ట్రానికి రప్పించాం. అన్ని అనుమతులూ తెచ్పించి, పనులు కూడా ప్రారంభిస్తున్నాం. 24 నెలల్లో ప్లాంట్‌ పనులు పూర్తిచేయించే బాధ్యత నాది. డేట్‌ రాసి పెట్టుకోండి. 2028 జూలై 3న మళ్లీ వచ్చి ప్లాంట్‌ను నేనే ప్రారంభిస్తాను. దీనికి సంబంధించిన బాధ్యతను నేను, జిందాల్‌ తీసుకుంటున్నాం’’ అని చంద్రబాబు ప్రకటించారు.

విజన్‌ ఉన్న సీఎంతో పనిచేయడం గర్వకారణం : సజ్జన్‌ జిందాల్‌

చంద్రబాబులాంటి విజన్‌ ఉన్న నేతతో పనిచేయడం గర్వంగా ఉందని జిందాల్‌ సౌత్‌వెస్ట్ మిటెడ్‌ చైర్మన్‌, సీఎండీ సజ్జన్‌ జిందాల్‌ అన్నారు. ఏడాదికి 2 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో బళ్లారి ప్లాంట్‌కు దీటుగా రాయలసీమ ప్లాంట్‌ను నిర్మిస్తామన్నారు. 50 వేల కోట్ల పెట్టుబడి పెడతామని.. 50వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ..వైఎస్‌ కుటుంబానికి అండగా నిలిచిన కడప జిల్లాకు వారు చేసింది శూన్యమన్నారు. స్టీల్‌ప్లాంట్‌తో సీమవాసుల కల సాకారం అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ చెప్పారు.

Updated Date - Jul 04 , 2026 | 04:12 AM