భవిష్యత్తు ఈవీలదే..!
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:04 AM
వాహన రంగంలో భవిష్యత్తంతా ఈవీ(విద్యుత్ వాహనాలు)లదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిమాండ్‌కు తగిన విధంగా ఈవీల ఉత్పత్తికి సిద్ధం కావాలని హీరో సంస్థకు సూచించారు.
డిమాండ్‌కు తగినట్లు ఉత్పత్తికి సిద్ధం కండి
హీరో మోటోకార్ప్‌కు సీఎం చంద్రబాబు సూచన
తిరుపతి జిల్లాలో ‘హీరో’ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0కు శంకుస్థాపన
తిరుపతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): వాహన రంగంలో భవిష్యత్తంతా ఈవీ(విద్యుత్ వాహనాలు)లదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డిమాండ్‌కు తగిన విధంగా ఈవీల ఉత్పత్తికి సిద్ధం కావాలని హీరో సంస్థకు సూచించారు. ఆ సంస్థ ‘విడా’ పేరిట ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. బుధవారం తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మాదనపాళెం సమీపంలో హీరో మోటోకార్ప్‌కు చెందిన ‘గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0’కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్లాంటు ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూస్తామన్నారు. దీన్ని త్వరితగతిన పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. ‘హీరో’ వ్యవస్థాపక చైర్మన్ బ్రిజ్ మోహన్‌లాల్ ముంజాల్ పారిశ్రామికవేత్తే కాదని.. జాతి నిర్మాణానికి సహకరించిన మహనీయుడని కొనియాడారు. హీరో మోటోకార్ప్ వేరే రాష్ట్రంలో ప్లాంటు పెట్టాలని భావిస్తే... వారితో ప్రత్యేకంగా చర్చించి ఏపీలో ఏర్పాటు చేయాలని ఒప్పించానని గుర్తుచేశారు. 2018 లో తిరుపతిలో శంకుస్థాపన చేసిన హీరో ప్లాంటు.. ఇప్పుడు పెద్ద ఎత్తున వాహనాలను ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. హీరో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ చెప్పిన విధంగా రూ.3,200 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభించాలని కోరారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడేవాళ్లమని.. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామన్నారు. ఏపీలో రోడ్లు, రైలు, విమాన కనెక్టివిటీ అద్భుతంగా ఉందన్నారు. హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ ఎలక్ట్రిక్ వాహనం నడపగా.. సీఎం చంద్రబాబు అందులో కూర్చుని హీరో ప్లాంటును సందర్శించారు. హీరో సంస్థ ఉత్పత్తి చేస్తున్న ద్విచక్ర వాహనాల మోడళ్లను పరిశీలించారు. తమ వాహనాల ప్రత్యేకతలను పవన్ ముంజాల్ సీఎంకు వివరించారు. స్కూటీ కం ఆటో వాహనాన్ని పరిశీలించిన చంద్రబాబు.. ఆటో నుంచి స్కూటీని వేరు చేసే విధానాన్ని ఆసక్తిగా తిలకించారు. తిరుపతి జిల్లాలో తమ సంస్థ విస్తరణ ఏపీ ప్రభుత్వంపై తమకున్న విశ్వాసానికి నిదర్శనమని హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ అన్నారు. ‘తిరుపతి జిల్లాలో ఇప్పటికే రూ.1,500 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టాం. సంస్థ తయారీ యూనిట్ నుంచి ఇటీవలే 10 లక్షల వాహనాల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్నాం. కొత్తగా ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్(జీపీసీ) కోసం ప్రారంభ దశలో రూ.750 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాం. రాబోయే 3-5 ఏళ్లలో రూ.3,200 కోట్ల పెట్టుబడులు పెడతాం. తద్వారా 4 వేల మందికిపైగా అదనపు ఉపాధి కల్పిస్తాం’ అని ముంజాల్ తెలిపారు.
రేపు కడపకు సీఎం చంద్రబాబు
కడప కలెక్టరేట్, జూలై 1(ఆంధ్రజ్యోతి): ముఖమ్యంత్రి చంద్రబాబు శుక్రవారం కడప జిల్లా పర్యటనకు రానున్నారు. జేఎ్‌సడబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పునఃప్రారంభిస్తారని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి బుధవారం తెలిపారు. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద జేఎ్‌సడబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ స్థలంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్ద సీఎం దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి కన్యతీర్థం బాలాత్రిపురసుందరీ సమేత సుందరేశ్వరస్వామి దేవస్థానాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకుని జేఎ్‌సడబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శిలాఫలకంతోపాటు 400 మెగావాట్ల సోలార్ ప్లాంట్, ఇండస్ర్టియల్ పార్క్ శిలాపలకాలను ఆవిష్కరిస్తారు. 2:30 గంటలకు ఇక్కడి నుంచి బయల్దేరి హెలికాప్టర్‌లో కుప్పం వెళతారని కలెక్టర్ తెలిపారు.