పుట్టా మహేశ్‌పై చంద్రబాబు సీరియస్
ABN , Publish Date - Mar 16 , 2026 | 05:45 AM
హైదరాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్‌పై వచ్చిన ఆరోపణలను ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు.
డ్రగ్స్ ఘటనల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదన్న సీఎం
ఏలూరు ఎంపీకి టీడీపీ షోకాజ్ నోటీసు
ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
దాని ఆధారంగా చర్యలుంటాయని స్పష్టీకరణ
నివేదిక వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనీ ఎంపీకి నిర్దేశం
అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్‌పై వచ్చిన ఆరోపణలను ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. దీనిపై ఆయన్ను వివరణ కోరాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. డ్రగ్స్ లాంటి ఘటనల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. కొందరు వ్యక్తులు, నేతలు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రాకూడదన్నారు. వీలైనంత త్వరగా ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర అధ్యక్షుడికి సూచించారు. దీనిపై వెంటనే స్పందించిన పల్లా.. పుట్టా మహేశ్‌కు షోకాజ్ నోటీసు జారీచేశారు. మొయినాబాద్ ఫాంహౌస్‌లో శనివారం జరిగిన ఘటనలో మత్తు పదార్థాలు తీసుకున్నట్లు ఆయనపై వచ్చిన ఆరోపణలను, మీడియాలో వచ్చిన కథనాలను పార్టీ సీరియ్‌సగా తీసుకుందని తెలిపారు. ‘ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయి. దీనిపై మీరు పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలి.. ఈ అంశంపై సమగ్ర నివేదిక వచ్చేవరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి’ అని షోకాజ్‌లో పేర్కొన్నారు. ఆరోపణలకు ఐదు రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని మహేశ్‌కు స్పష్టంచేశారు. దాని ఆధారంగా పార్టీ అధిష్ఠానం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.