Share News

ఎన్నిసార్లు చెప్పాలి?

ABN , Publish Date - Mar 11 , 2026 | 03:55 AM

కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి మారాల్సి ఉన్నదని, వారికి త్వరలోనే తుది హెచ్చరిక చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

ఎన్నిసార్లు చెప్పాలి?

  • 40 మంది ఎమ్మెల్యేలను పిలిచి హెచ్చరించా

  • 15 మంది దారికొచ్చారు.. మిగిలిన వారు మారలేదు

  • త్వరలో నలుగురైదుగురిపై వేటు తప్పదు

  • స్థానిక సంస్థల ఎన్నికల్లోపే కఠిన నిర్ణయాలు

  • మంత్రులతో ప్రత్యేక భేటీలో సీఎం స్పష్టీకరణ!

అమరావతి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి మారాల్సి ఉన్నదని, వారికి త్వరలోనే తుది హెచ్చరిక చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో మంగళవారం సీఆర్డీయే సమావేశం అనంతరం మంత్రులు లోకేశ్‌, అనగాని సత్యప్రసాద్‌, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్‌తో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. తాజా రాజకీయ పరిణామాలతోపాటు పార్టీ క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆరు నెలల క్రితం రాష్ట్రంలో 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తాను అసంతృప్తితో ఉన్నానని, తాను వారిని పిలిచి హెచ్చరించడంతో 15 మంది దారికొచ్చారని, మిగిలిన వారు వ్యవహరిస్తున్న తీరుపై తన వద్ద నివేదికలు ఉన్నాయన్నారు. త్వరలో నలుగురైదుగురిపై వేటు తప్పదని సీఎం.. మంత్రుల వద్ద వ్యాఖ్యానించారు. అలాంటి వారిని పిలిచి ఫైనల్‌గా మాట్లాడతానని, పద్ధతి మార్చుకోకపోతే మాత్రం తనతో వారికి అదే చివరి సమావేశం అవుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లోపే కఠిన నిర్ణయాలు ఉంటాయని, పనిచేయని వారి స్థానంలో వేరే నాయకులు పనిచేస్తారని తెలిపారు. ఈసారి పార్టీ గెలుపు ముఖ్యమని, వ్యక్తుల కోసం పార్టీని బలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే కొంతమందిని వదులుకొని ముందుకు వెళ్లిపోతామన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టగలిగామని, ఏకసభ్య కమిషన్‌ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. మండలిలో తిరుమల నెయ్యి కల్తీపై వైసీపీ సభ్యులు మాట్లాడకుండా ఇందాపూర్‌పై మాట్లాడి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించారని తెలిపారు.


మద్యం కుంభకోణంలో వైసీపీ వ్యవహరించిన తీరును, డిస్టలరీల నుంచి తీసుకున్న ముడుపుల వ్యవహారాన్ని ప్రజలు సీరియ్‌సగా తీసుకున్నారన్నారు. ముఖ్యంగా నాసిరకం మద్యం కారణంగా ప్రజల ఆరో గ్యం దెబ్బతిన్న వ్యవహారం ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందని మంత్రులు.. సీఎంకు వివరించారు. మాజీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులు కూడా త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉందని, డిశ్చార్జి పిటిషన్లు వేసి విచారణలో జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే ఈ పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేస్తున్నాయని మంత్రులు వ్యాఖ్యానించారు. ఈ కేసుల విచారణ ప్రారంభమైతే జగన్‌ ప్రతి రోజూ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. కాగా, వైసీపీ హయాంలో దళితులు, బీసీలు, ఇతర వర్గాలపై జరిగిన దాడుల కేసుల పురోగతిపై కూడా చర్చ జరిగింది. అనంతబాబు డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్య, రేపల్లెలో అమర్‌నాఽథ్‌ గౌడ్‌ను సజీవదహనం చేయడం, మాచర్లలో చంద్రయ్య హత్య కేసు, ఇతర కేసుల పురోగతిపై చర్చించారు. వీటిని ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని నిర్ణయించారు.


క్యాడర్‌లో అసంతృప్తిని తొలగించడం ఎలా?

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల కు చేరువ చేయడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళుతున్నామని సీఎం వివరించారు. అదే సమయంలో టీడీపీ క్యాడర్‌లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రులతో సీఎం చర్చించారు. ఎమ్మెల్యేలు, క్యాడర్‌ మధ్య సమన్వయం ఉంటే ఈ అసంతృప్తి ఉండదని సీఎం పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీలోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు ఆర్థికంగా నష్టపోయారని, అటువంటి వారిని గుర్తించి పదవులు ఇచ్చామని ఓ మంత్రి తెలిపారు. అయితే క్యాడర్‌లో ఆశలు ఇంకా ఎక్కువగా ఉన్నాయన్నారు. వైసీపీలా మనం కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తే వారికి, మనకు తేడా ఉండదని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘శిక్షణ కార్యక్రమాలకు పార్టీ మండల, గ్రామస్థాయి నాయకత్వాలను పిలుస్తున్నాం. అలా కాకుండా ఒక్కో నియోజకవర్గంలో ముఖ్యమైన క్యాడర్‌ను, ఎమ్మెల్యేను పిలిచి రెండు రోజులు పార్టీ కార్యాలయంలోనే ఉండేలా చేసి, వారితో మాట్లాడితే వారి నడు మ ఉన్న ఎడం తగ్గుతుంది. ఎవరెవరికి విభేదాలు ఉన్నాయో గుర్తించి వారిని పిలిస్తే వాటిని ఇక్కడే పరిష్కరించి పంపించవచ్చునని ఓ మంత్రి సూచించారు. ఈ ప్రతిపాదన బాగానే ఉందని సీఎం చెప్పారు.

రాష్ట్రంపై యుద్ధ ప్రభావం

యుద్ధం కారణంగా రాష్ట్రంపై పడుతున్న ప్రభావం, గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులపై చర్చ జరిగింది. రాష్ట్రం నుంచి కోడిగుడ్లు, అరటి, రొయ్యల ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని మంత్రులు తెలిపారు. తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తన దృష్టికి కూడా తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

Updated Date - Mar 11 , 2026 | 04:03 AM