Share News

నిధులు రాబట్టాలి!

ABN , Publish Date - Jan 26 , 2026 | 03:22 AM

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మోదీ ప్రభుత్వం బిల్లు పెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

నిధులు రాబట్టాలి!

  • మీకు అప్పగించిన శాఖలతో సంప్రదింపులు జరపాలి

  • టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

  • అమరావతి చట్టబద్ధత బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే

  • మంత్రి, అధికారులతో టచ్‌లో ఉండండి

  • తెలంగాణ ప్రాజెక్టులకు మనం అభ్యంతరం చెప్పలేదు

  • నల్లమలసాగర్‌పై ఆ రాష్ట్ర వాదన కరెక్టు కాదు

  • పార్లమెంటులో స్పష్టంగా తెలియజేయండి

  • కలెక్టర్ల సదస్సుకూ వర్చువల్‌గా హాజరు కావాలి

  • టీడీపీపీ భేటీలో ఎంపీలకు చంద్రబాబు ఆదేశం

అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మోదీ ప్రభుత్వం బిల్లు పెట్టనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దీనిపై కేంద్రంలోని సంబంధిత మంత్రి, అధికారులతో టచ్‌లో ఉండాలని టీడీపీ ఎంపీలకు సూచించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, కేంద్రంతో జరపాల్సిన సంప్రదింపులపై సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. ‘రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం. మన రాష్ట్రానికి ఇంకేం సాధించవచ్చో ఆలోచించి నిధులు రాబట్టాలి. మీ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి అవకాశాలు, సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలి. కేంద్రంలోని వివిధ శాఖలతో సంప్రదింపులు జరపడానికి ఎంపీలకు కొన్ని శాఖలను అప్పజెప్పాం. ఆయా శాఖలకు సంబంధించి ఏపీలో జరుగుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్డేట్‌ చేసుకోవాలి. మంత్రులు, కార్యదర్శులతో మాట్లాడాలి. రాష్ట్ర అంశాలపై అవగాహనకు ఫిబ్రవరిలో జరిగే కలెక్టర్ల సదస్సులో ఎంపీలు వర్చువల్‌గా పాల్గొనాలి’ అని స్పష్టం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర-రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ, పూర్వోదయ పథకం, పోలవరం-నల్లమల సాగర్‌ ఈ మూడింటినీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రాధాన్యాంశాలుగా తీసుకోవాలన్నారు.


వివాదాలు వద్దు.. నీళ్లు కావాలి..

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న క్రమంలో ఏపీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా చూడాలని ఎంపీలతో సీఎం అన్నారు. ‘పోలవరం ప్రాజెక్టుకు తాజా అంచనాలు ఇచ్చాం. దీని నిర్మాణంతోపాటు ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తి చేయాలి. రూ.12 వేల కోట్లు ఇంకా కేంద్రం నుంచి రావాలి. 2027 జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల్లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయగలిగితే బావుంటుంది. అలాగే రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన నీటి ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలు అవసరం లేదు. అదే సమయంలో నల్లమలసాగర్‌ వంటి అంశాలు పార్లమెంటులో ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా ప్రస్తావనకు వస్తే మన వాదనలను గట్టిగా వినిపించాలి. తెలంగాణ కాళేశ్వరం నిర్మించి, మంజీరాకు నీళ్లను తరలించినా ఏపీ అభ్యంతరం చెప్పలేదని కేంద్రానికి అర్థమయ్యేలా చెప్పాలి. అదే సందర్భంలో నల్లమలసాగర్‌ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో తెలంగాణ అభ్యంతరం చెప్పడం కరెక్టు కాదని వివరించాలి. ఇక అమరావతి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. రెండో దశ కూడా ప్రారంభం కానుంది’ అని వెల్లడించారు. పూర్వోదయ ప్రాజెక్టు కింద రూ.40 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం ఎంపీలకు వివరించారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు నాలుగు లైన్ల రైల్వే ట్రాక్‌ వేసేలా చూడాలన్నారు. ఫ్లైవోవర్లు, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలను రైల్వే శాఖ పెద్దఎత్తున చేపట్టేందుకు సిద్ధంగా ఉందని, పార్లమెంటు నియోజకవర్గాల్లో అలాంటివి ఏమైనా ఉంటే గుర్తించి, నిధులు తెచ్చుకోవాలని సూచించారు.


వైద్య రంగంలో ప్రస్తుతం ఏపీ రెండో స్థానంలో ఉందని, పీపీపీ పద్ధతుల్లో ఆస్పత్రుల నిర్మాణానికి వీజీఎఫ్‌ కూడా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని చెప్పారు. దీనిని ప్రతి ఎంపీ దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా వ్యవహరించాలని కోరారు. సభలో గానీ, క్షేత్రస్థాయిలో గానీ కూటమి లక్ష్యాలకు విఘాతం కలిగించేలా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవహరించొద్దని ఆదేశించారు. ఈసారి టీడీపీపీ భేటీకి జనసేన, బీజేపీ ఎంపీలను కూడా పిలుద్దామని.. దీనివల్ల మనవాణికి బలం చేకూరుతుందని తెలిపారు. విభజన సమస్యలు, జాతీయ రహదారుల విస్తరణ, సాగరమాల ప్రాజెక్టుల్లో చేపడుతున్న పనుల పురోగతిని తెలుసుకోవాలన్నారు. ‘కేంద్రం నుంచి ఏమేరకు నిధులు రాబట్టవచ్చో చూడాలి. రాష్ట్ర స్థాయి అంశాలే కాకుండా జాతీయ స్థాయిలో ఎన్డీయే చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేస్తున్న సమయంలో ధీటుగా సమాధానం చెప్పేందుకు చొరవ చూపాలి’ అని సూచించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, మిగిలిన ఎంపీలు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి లోకేశ్‌ సమావేశంలో పాల్గొన్నారు. మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు హరీశ్‌, లక్ష్మీనారాయణ హాజరుకాలేదు.


జీతాలు లేకున్నా మా జీవితాలు మీ చేతుల్లోనే!

ఎంపీలు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని.. పార్లమెంటులో మాట్లాడే సమయంలో తగిన సమాచారంతో మాట్లాడితే వ్యక్తిగతంగా ఎంపీలకు, వారితోపాటు పార్టీకి గౌరవంగా ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అరకొర పరిజ్ఞానంతో మాట్లాడితే అభాసుపాలవుతామని.. ఇప్పటికీ కొందరు సబ్జెక్ట్‌పరంగా వీక్‌గా ఉన్నారని అలాంటి వారి జీతాలు కట్‌ చేస్తామన్నారు. ఆ వెంటనే.. అయినా మీ జీతాలు కట్‌ చేయలేం కదా అని చెప్పారు. కొందరు ఎంపీలు స్పందిస్తూ.. మా జీతాలు మీ చేతుల్లో లేకపోతేం ఏం సార్‌.. మా జీవితాలు.. మా సీట్లు మీ చేతుల్లోనే ఉన్నాయని అనగా.. సరిగా పనిచేయని వారి విషయంలో అది ఎలాగూ జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 26 , 2026 | 03:24 AM