‘స్వచ్ఛాంధ్ర’పై సీరియ్‌సనెస్ లేదు
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:47 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర’ నిర్వహణపై ఇంకా సీరియ్‌సనెస్ రాలేదని సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు.
కలెక్టర్ల సదస్సులో సీఎం అసహనం
అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛాంధ్ర’ నిర్వహణపై ఇంకా సీరియ్‌సనెస్ రాలేదని సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 14 నెలలైనా ఇంకా చాలాప్రాంతాల్లో అధికారులు అలాగే వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ‘స్వచ్ఛాంధ్ర’ అంశంపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురే్‌షకుమార్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు సీఎం జోక్యం చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల కాకినాడ, సామర్లకోట వెళ్లినప్పుడు అక్కడ పారిశుధ్యం చాలా దారుణంగా ఉందని, రోడ్ల పక్కన చెత్త కనిపించిందని తెలిపారు. ప్రజారోగ్య పరంగా ‘స్వచ్ఛాంధ్ర’ చాలా సీరియస్ కార్యక్రమమని, ఇది మన సంస్కృతిలో భాగం కావాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కోసం రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు ఒకదానికొకటి పోటీ పడాలని చెప్పారు. పల్లెల్లో కూడా పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. స్మార్ట్ హెల్త్‌కేర్, వ్యవసాయంలో సాంకేతికత, విద్య, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో డీప్ టెక్ వినియోగం పెరగాలని సూచించారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడానికి ఎలాంటి నిబంధనలు ఉండకూడదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను వ్యసాయంతో పాటు ఉద్యాన, పశు సంవర్థక రంగాలవైపు మళ్లించాలని చెప్పారు. ఆర్‌అండ్‌బీ, మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్యశాఖల్లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామం సిబ్బంది సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే అంశంపై కలెక్టర్లకు స్వేచ్ఛ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాస్థాయిలోనూ ఆర్టీజీఎస్ కేంద్రాలు, డ్యాష్ బోర్డులు ఏర్పాటు చేసుకుని రియల్‌టైమ్ గవర్నెన్స్ అమలు చేయాలని సూచించారు. ఈ నెల 16, 17, 18, 23, 24, 25వ తేదీల్లో ‘రైతన్నా- మీకోసం’ చేపట్టాలన్నారు.
ఢిల్లీ వెళ్లి నిధులు సాధించండి
కేంద్రం నుంచి మంజూరై ఇంకా రాష్ట్రానికి అందని పెండింగ్ నిధులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు తెచ్చుకోవాలని కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. దీనికోసమే అసెంబ్లీ సమావేశాలు త్వరగా పూర్తి చేశామని తెలిపారు. మూలధన వ్యయానికి సంబంధించిన బిల్లులు ఏ శాఖలో ఉన్నా తక్షణమే యూసీలు సమర్పిస్తే, సాస్కీ పథకం కింద కేంద్రం మరిన్ని నిధులు అందిస్తుందని వివరించారు. మైనింగ్‌లో సాస్కీ సంస్కరణలు గడువులోగా పూర్తిచేసి అదనంగా వచ్చే రూ.300 కోట్లు తెచ్చుకోవాలన్నారు. రోడ్డు భద్రతకు సంబంధించిన సంస్కరణలు అమలు చేస్తే అదనంగా రూ.350 కోట్లు వస్తాయి కానీ, ఆ ప్రతిపాదన ఇంతవరకు కేంద్రానికి పంపలేదని, దాని గడువు ముగిసిపోయిందని అధికారులు చెప్పారు. అయినా కేంద్రంతో మాట్లాడి ప్రయత్నిద్దామని సీఎం చెప్పారు. ‘‘భూసంస్కరణలు అమలు చేస్తే అదనంగా రూ.250 కోట్లు వస్తాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. వైజాగ్‌లోని యూటీఈ మాల్‌కి రూ.172 కోట్లు మంజూరైతే, మొదటి దశలో రూ.86 కోట్లు విడుదలయ్యాయి. వీటిని పూర్తిగా వాడలేదు. ఈ నెల 15లోగా పూర్తిగా వాడి యూసీలు సమర్పిస్తే రెండోదశ రూ.86 కోట్లు విడుదలవుతాయి. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు ఆదేశించారు. రాజమండ్రి, గడికోటలోని టూరిజం ఐకానిక్ సెంటర్ ప్రాజెక్టులు, వైజాగ్‌లోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ప్రాజెక్టులకు కూడా మొదటి విడత నిధులు 15లోగా పూర్తిగా వాడితే, రెండో విడత నిధులు విడుదలవుతాయని సీఎం చెప్పారు.
ఎల్పీజీ సరఫరాపై ముగ్గురు మంత్రులతో కమిటీ
రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు, సరఫరాపై కలెక్టర్ల సమావేశంలో సీఎం సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏజెన్సీల దగ్గర 5 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితీ ఇలాగే ఉందని తెలిపారు. దీంతో ఎల్పీజీ, ఉద్యాన పంటల మార్కెట్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎక్కడా గ్యాస్ కొరత లేదని, కేంద్రంతో మాట్లాడి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.