Share News

‘రెవెన్యూ’కు ఫ్రెష్‌ లుక్‌!

ABN , Publish Date - Feb 24 , 2026 | 03:40 AM

రెవెన్యూను దారిలోకి తీసుకొచ్చి.. ఆ శాఖకు ఫ్రెష్‌ లుక్‌ తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

‘రెవెన్యూ’కు ఫ్రెష్‌ లుక్‌!

  • ఆ శాఖను దారిలోకి తీసుకురావాలి

  • భూముల రీసర్వేతో అన్ని సమస్యలూ పోవాలే తప్ప.. కొత్త వివాదాలు రాకూడదు

  • ఏసీబీ దాడులు చేసే పరిస్థితి ఉండొద్దు

  • పనిచేయని తహసీల్దార్లను పక్కనపెట్టండి

  • ప్రభుత్వ సేవలపై ప్రజల్లో మరింత అవగాహనకు ప్రత్యేక కార్యాచరణ

  • ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత కనిపించకూడదు

  • ఆలయాల్లో సదుపాయాలు మెరుగుపడాలి

  • పనితీరు ఆధారంగా ఉద్యోగులకు వెయిటేజీ

  • వివిధ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): రెవెన్యూను దారిలోకి తీసుకొచ్చి.. ఆ శాఖకు ఫ్రెష్‌ లుక్‌ తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు రెవెన్యూ శాఖ అవినీతి రహితంగా ఉండాలని పేర్కొన్నారు. భూముల రీ సర్వేతో అన్ని సమస్యలూ పోవాలే తప్ప.. కొత్త వివాదాలు రాకూడదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సోమవారం అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కార్యాలయం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షించారు. రెవెన్యూ శాఖ ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. సరిగా పనిచేయని తహశీల్దార్లను పక్కన పెట్టాలని, బాగా పనిచేసే డిప్యూటీ తహసీల్దార్లను గుర్తించి వారికి తహసీల్దార్లుగా పదోన్నతులు ఇవ్వాలన్నారు. సర్వేయర్లు సరిగా వ్యవహరించకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలపై ఆడిట్‌ చేయించాలని సూచించారు.


ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యానికి వారిదే బాధ్యత

ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చూడాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు తరచూ కలెక్టర్లతో వైద్యుల ఖాళీల వివరాలు తెలుసుకొని భర్తీ చేయాలన్నారు. ఆస్పత్రులు బాగుపడాలని, దేవాలయాల్లో సదుపాయాలు మెరుగుపడాలని సూచించారు. ఆస్పత్రుల్లో పారిశుధ్యం పాటించకుంటే.. సంబంధిత అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీని బాధ్యులను చేయాలన్నారు. గతంతో పోలిస్తే ఆలయాల్లో సౌకర్యాలు బాగా మెరుగయ్యాయని.. మరింత పెంచాలని సూచించారు. తాగునీటి శాంపిళ్ల పరీక్షలకు మొబైల్‌ ల్యాబ్‌లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

అభినందన లేఖలు ఇవ్వండి

ఉద్యోగుల పనితీరును మదింపు చేస్తున్నందున.. పనితీరు బాగా లేని వారిని మోటివేట్‌ చేయడంతో పాటు బాగా పనిచేస్తున్న వారిని ప్రశంసించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల ఉద్యోగుల్లో పనిచేశామన్న సంతృప్తి, ఉత్సాహం వస్తాయన్నారు. ఈ విధానం బాగుంటుందని, ఉద్యోగులను ఇలా అభినందించడం ఇదే తొలిసారి అవతుందని పలువురు ఆధికారులు అన్నారు. ఈ రకమైన విధానంతో ఉద్యోగుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. నెలవారీగా బాగా పని చేస్తున్న ఉద్యోగులకు అభినందన లేఖలు అందించాలని సీఎం సూచించారు. వ్యక్తిగత రికార్డుల్లోనూ నమోదు చేయాలని స్పష్టం చేశారు.


ఒప్పందాలను విజయవంతంగా అమలు చేయాలి

ప్రభుత్వం పెద్దఎత్తున టెక్నాలజీ సాయంతో సేవలు అందిస్తోందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పరిపాలనలోనూ సాంకేతికతను అందిపుచ్చుకున్నామని చెప్పారు. టెక్నాలజీ సాయంతో అందిస్తున్న సేవలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ సేవలను టెక్నాలజీ సాయంతో మరింత సులభతరం చేయాలని ఆదేశించారు. ఇటీవల ఢిల్లీలో ఏఐ-ఇంపాక్ట్‌ సదస్సుకు హాజరయ్యామని, అక్కడ ప్రదర్శించిన టెక్నాలజీలను అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఏడు ఒప్పందాలను మున్సిపల్‌, వైద్యం, వాణిజ్య పన్నులు, ఐటీ, పరిశ్రమల శాఖలు విజయవంతంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

Updated Date - Feb 24 , 2026 | 03:41 AM