Share News

నేడు హస్తినకు చంద్రబాబు

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:50 AM

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌-2026’కు సీఎం చంద్రబాబు శుక్రవారం హాజరు కానున్నారు. ఏపీని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సదస్సులో పాల్గొంటున్న ఆయన..

నేడు హస్తినకు చంద్రబాబు

  • ఏఐ సదస్సుకు హాజరు

  • ఐబీఎం సహా పలు సంస్థలతో కీలక ఎంవోయూలు

  • క్వాంటమ్‌ ఏఐ వర్సిటీ ఏర్పాటు కోసం ఎన్‌ఐఈఎల్‌ఐటీతో ఒప్పందం

  • ఏఐ ట్యూటర్‌ కోసం ఐఐటీ మద్రాస్‌తోనూ

  • ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటుపై ప్రకటన

  • పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ

న్యూఢిల్లీ/ అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌-2026’కు సీఎం చంద్రబాబు శుక్రవారం హాజరు కానున్నారు. ఏపీని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సదస్సులో పాల్గొంటున్న ఆయన.. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఉదయం జైపూర్‌ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. తర్వాత భారత్‌ మండపంలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌కు వెళ్తారు. ఉదయం 9.30గంటలకు ‘ఏఐ యాక్సిలరేటర్స్‌: ఫ్యూయలింగ్‌ ఇండియాస్‌ ఎకనమిక్‌ గ్రోత్‌’ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్‌లో ఆయన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్‌ ప్రసాద, టీసీఎస్‌ ప్రతినిధులతో కలిసి పాల్గొంటారు. అనంతరం ఏపీలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్థి కల్పనకు సంబంధించిన కొన్ని ఎంవోయూలు రాష్ట్రప్రభుత్వం కుదుర్చుకోనుంది. ఏఐ, క్వాంటమ్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ అంశాల్లో ఏపీలోని 10 లక్షల మంది యువతకు నైపుణ్యాలు కల్పించేలా ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎంతో ఒప్పందం చేసుకోనుంది. క్వాంటమ్‌తో పాటు ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రం ఏర్పాటు కోసం యూనిసీసీ సంస్థతో, క్వాంటమ్‌ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎన్‌ఐఈఎల్‌ఐటీతోనూ ఎంవోయూ కుదుర్చుకోనుంది. ‘ఏఐ ట్యూటర్‌’ ఏర్పాటుకోసం ఐఐటీ మద్రాస్‌ కూడా ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది. ఎన్విడియా భాగస్వామ్యంతో ఏపీలో ఏఐ లివింగ్‌ ల్యాబ్స్‌ ఏర్పాటుపై ఈ సందర్భంగా ప్రకటన చేయనున్నారు.


అనంతరం క్వాంటెలా ఇంక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ శ్రీధర్‌ గాదితోనూ సీఎం సమావేశమవుతారు. మద్యాహ్నం 12 గంటలకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నిర్వహించే రౌండ్‌ టేబుల్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. ‘కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం’ అనే అంశంపై నిర్వహించే ఈ సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఏఐ సమ్మిట్‌ వేదిక వద్దే యూకే ప్రతినిధి బృందంతోనూ భేటీ అవుతారు. బ్రిటన్‌ ఏఐ, ఆన్‌లైన్‌ సేఫ్టీ విభాగం మంత్రి కనిష్క్‌ నారాయణ్‌, భారత్‌లో యూకే హైకమిషనర్‌ లిండి కామరాన్‌, వాతావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మినిస్టర్‌ కౌన్సెలర్‌ శాలీ టేలర్‌ తదితరులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆరాంకో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అబ్దుల్‌ రెహమాన్‌ ఐతుకైర్‌, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌, ఆటోడెస్క్‌ ఏఐ హెడ్‌ మైక్‌ హేలీతో సీఎం విడివిడిగా భేటీ అవుతారు. అనంతరం ఢిల్లీ నుంచి బయల్దేరి అమరావతికి చేరుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఐఏఎస్‌ అధికారి వికాస్‌ మర్మత్‌ వివాహానికి హాజరు

కాగా.. కుప్పం ఏరియా డెవలప్మెంట్‌ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్‌, ఐఏఎస్‌ అధికారి వికాస్‌ మర్మత్‌ వివాహానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గురువారం సాయంత్రం విజయవాడ నుంచి జైపూర్‌కు చేరుకున్న సీఎం.. అక్కడి వృందావన్‌ ప్యాలెస్‌లో జరిగిన పెళ్లికి హాజరై వధూవరులను ఆశ్వీరదించారు. రాత్రికి జైపూర్‌లోనే బస చేసి శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్తారు.

Updated Date - Feb 20 , 2026 | 05:29 AM