ఒత్తిడిలో సామాన్యుడి జీవనం
ABN , Publish Date - May 21 , 2026 | 04:48 AM
భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, సామాన్య ప్రజల జీవితాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు.
భౌగోళిక రాజకీయ పరిస్థితులే కారణం
ఆధునిక యుగపు ఆధ్యాత్మికవేత్త రవిశంకర్
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వార్షికోత్సవంలో చంద్రబాబు
అమరావతి/బెంగళూరు, మే 20(ఆంధ్రజ్యోతి): భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, సామాన్య ప్రజల జీవితాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఇలాంటి సమయంలో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ లాంటి సంస్థలు ప్రజలను ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు అత్యుత్తమ సేవలందిస్తున్నాయని తెలిపారు. ఒత్తిడిని ఎదుర్కొని సమర్థవంతంగా జీవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి సంస్థలే మార్గనిర్దేశం చేస్తున్నాయన్నారు. శ్రీరవిశంకర్ గురూజీ జన్మదినోత్సవం సందర్భంగా బెంగళూరులో బుధవారం జరిగిన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ వార్షికోత్సవంలో కేవలం ఓ సీఎంగా ఇక్కడికి రాలేదు. ఓ భారతీయుడిగా, గురూజీ బోధనలను అనుసరిస్తున్న వ్యక్తిగా వచ్చాను. రవిశంకర్ కేవలం ఆధ్యాత్మికతను బోధించే గురువు కాదు. శాంతిసామరస్యాలను చాటిచెప్పే ప్రపంచ మానవుడు. హింస లేని సమాజం, ఒత్తిడి లేని మనుషులు అనే అంశాన్ని సాధించాలని దశాబ్దాలుగా బోధిస్తూ మానవాళికి గొప్ప సేవ చేస్తున్నారు.’’ అని పేర్కొన్నారు. గ్రామాల నుంచి అంతర్జాతీయ స్థాయి సంస్థల వరకు, అనిశ్చితి నెలకొన్న కొలంబియా ప్రాంతాల వరకు ‘చర్చలు’ అనే శాంతి మార్గం ద్వారా మార్పులు తెచ్చిన ఘనత రవిశంకర్‌దని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సామాన్య ప్రజలతోపాటు అంతర్జాతీయ సంస్థల విశ్వాసాన్ని గెలుచుకున్న ఆధునిక యుగపు ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ అని కొనియాడారు. 45 ఏళ్ల క్రితం హ్యాపీ హ్యూమన్ బీయింగ్.. స్ట్రెస్ ఫ్రీ సొసైటీ లక్ష్యంతో ప్రారంభమైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆ తర్వాత సురక్షిత తాగునీరు, నదుల ప్రక్షాళన, మహిళా స్వయం సమృద్ధి, విలువలతో కూడిన విద్య లాంటి రంగాల్లో ప్రజలకు సేవలందిస్తుండటం అభినందనీయమన్నారు. గతంలో తాను కూడా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షణ తరగతులు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచంలో ఉండే హిందువులంతా ఒక్కసారైనా తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలని సీఎం సూచించారు.
అభివృద్ధి అంటే..
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయలను రాష్ట్రంలో కల్పిస్తున్నామని, దాని ఫలితంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఏపీ సమీకృత అభివృద్ధి సాధించాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్లోబల్ ఎకానమీలో ఏపీని కీలక రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. స్పేస్, డ్రోన్, డేటా సెంటర్లు పెద్ద ఎత్తున ఏపీలో ఏర్పాటవుతున్నాయని తెలిపారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
ఎంత అభివృద్ధి సాధిస్తున్నా, ప్రజల్లో శాంతి సౌఖ్యాలు రావాలంటే ఆధ్యాత్మికత ఎంతో ముఖ్యం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు ఏపీకి రావాలి. అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక ప్రగతి, సాంకేతికత మాత్రమే కాదు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే అసలైన అభివృద్ధి.
- చంద్రబాబు