కష్టపడిన ప్రతి కార్యకర్తనూ గుర్తిస్తాం
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:21 AM
తెలుగుదేశం పార్టీలో తొలి నుంచీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చాం. కష్టపడి ప్రతి కార్యకర్తనూ గుర్తించి పదవులు ఇచ్చే కొత్త వ్యవస్థను లోకేశ్ తీసుకువచ్చారు...
పార్టీ శ్రేణుల శిక్షణ తరగతుల్లో చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ‘తెలుగుదేశం పార్టీలో తొలి నుంచీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చాం. కష్టపడి ప్రతి కార్యకర్తనూ గుర్తించి పదవులు ఇచ్చే కొత్త వ్యవస్థను లోకేశ్ తీసుకువచ్చారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన పార్టీ శ్రేణుల శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. కాఫీ కబుర్లు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మాట్లాడారు. ‘ఇటీవల మండల స్థాయి నాయకులకూ పార్టీలో కీలకమైన పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించాం. ఇదే విధానాన్ని మున్ముందు మరింత విస్తృతంగా అమలు చేస్తాం. పార్టీ కార్యకర్తలందరూ తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలి. కార్యకర్తలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ఆలోచన చేస్తున్నాం. న్యాయబద్ధమైన ఆదాయ మార్గాన్ని కల్పించి ప్రతి కార్యకర్త సొంత కాళ్లపై నిలబడేలా చేయాలన్నదే పార్టీ లక్ష్యం. పార్టీ కమిటీల్లో సీనియర్లను గౌరవించుకుంటూనే యువతకు పెద్దపీట వేశాం. దామాషా ప్రకారం ప్రతి కులానికీ ప్రాతినిధ్యం కల్పించాలన్నది టీడీపీ విధానం. దానికి అనుగుణంగా పార్టీ కమిటీల్లో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం కల్పించాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.