త్వరలో లక్ష టిడ్కో ఇళ్లలో గృహప్రవేశాలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:30 AM
రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలో నే లబ్ధిదారులకు అందించి, గృహప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
ఇల్లు రానివారికి దరఖాస్తు రుసుం చెల్లింపు
త్వరలో మరో 70 అన్న క్యాంటీన్లు ప్రారంభం
మున్సిపల్ సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 1,00,875 టిడ్కో ఇళ్లను త్వరలో నే లబ్ధిదారులకు అందించి, గృహప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించా రు. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లకు డబ్బు చెల్లించి, ఫ్లాట్ కేటాయింపులు జరగనివారికి దరఖా స్తు రుసుం తిరిగి చెల్లించాలని ఆదేశించారు. మొత్తం 83,865 మంది దరఖాస్తుదారులకు రూ.174 కోట్లు వెనక్కివ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ డోర్ నంబర్లు త్వరితగతిన కేటాయించాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా వాటర్ క్వాలిటీ మానిటరింగ్ కోసం స్మార్ట్ వాటర్ పైప్‌లైన్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని అన్నారు.రాష్ట్రంలో 17లక్షల మందికి పైగా పురమిత్ర యాప్‌ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సీఎంకు అధికారులు వివరించారు. ఈ యాప్ ద్వారా 92వేల గ్రీవెన్స్‌లు రాగా, వాటిని పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాన్ని హాట్‌స్పాట్‌గా గుర్తించి స్థానిక అధికారులు పరిష్కరించేలా చూడాలని సీఎం సూ చించారు. అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ బాండ్లు జారీ చేయడంతో పాటు అర్బన్ అథారిటీ ఏర్పాటు పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మున్సిపల్ షాపుల అద్దెలు మూడేళ్లకోసారి 33శాతం పెంచడానికి బదు లు ఏటా తక్కువ శాతం పెరిగేలా కొత్త విధానం తీసుకురావాలని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరో 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
అమరావతిలో కాలుష్య నియంత్రణ
అమరావతిలో గాలి నాణ్యత పెరిగేలా చూడాలని చంద్రబాబు సూచించారు. స్ర్పింకర్లు ఉపయోగించి దుమ్ము, ధూళిని కట్టడి చేయాలని సూచించారు. రాష్ట్రంలో పీ4ను ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. పేదలకు చేయూత ఇచ్చేలా చేపట్టిన పీ4కి మార్చి 30 నాటికి ఏడాది పూర్తి కావస్తుండటంతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.