సంతానమే సంపద
ABN , Publish Date - May 17 , 2026 | 04:54 AM
ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం ప్రచారం చేసిన తాను, ఇప్పుడు జనాభా పెంపును ప్రోత్సహిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
మూడో బిడ్డకు రూ.30 వేలు.. నాలుగో బిడ్డకు 40 వేలు
జనాభా పెంపునకు ప్రోత్సాహకాలు
భవిష్యత్తులో ‘తల్లికి వందనం’ సాయం పెంపు
శ్రీకాకుళం ముఖచిత్రం మారుస్తా
ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేలా అభివృద్ధి
మార్చి నాటికి భూవివాదాలన్నీ పరిష్కారం
2047నాటికి 54 లక్షలకు తలసరి ఆదాయం
నరసన్నపేటలో ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
శ్రీకాకుళం, మే 16(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు జనాభా నియంత్రణ కోసం ప్రచారం చేసిన తాను, ఇప్పుడు జనాభా పెంపును ప్రోత్సహిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందులో భాగంగా, మూడో సంతానం కలిగిన వెంటనే రూ. 30 వేలు, నాలుగో బిడ్డకు రూ. 40 వేలు అందిస్తామని ఆయన ప్రకటించారు. ‘‘పిల్లలే మన అసలైన సంపద. జనాభా పెరిగితేనే భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది’’ అని సీఎం వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ ప్రజావేదిక కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఉత్తరాంధ్ర అభివృద్ధి, తల్లికి వందనం, భూముల ప్రక్షాళన తదితర అంశాలపై ఆయన కీలక ప్రకటనలు చేశారు. అదే సమయంలో వైసీపీపై విరుచుకుపడ్డారు. ‘‘గతంలో వైసీపీ పాలన ఒక ఉగ్రవాదం తరహాలో సాగింది. వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు. దీపావళికి నరకాసురుడిని వధించినట్లుగానే, మొన్నటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అరాచక శక్తులను తరిమికొట్టారు. నాడు కనీసం పారిశుధ్యాన్ని సైతం పట్టించుకోలేదు.’’ అని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘వైసీపీ హయాంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగింది. గొడ్డలి పార్టీ అరాచకాలతో ప్రజల ఆస్తులకు ముప్పు ఏర్పడింది. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఏమరుపాటుగా ఉంటే ఈసారి గొడ్డలి ప్లస్ వస్తుంది. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరి చేశారు. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఎక్కడా చెత్త ఎత్తే నాథుడే కనిపించేవాడు కాదు. 22ఏ జాబితాలోని భూములను మింగేశారు. అలాంటి విధ్వంసాల ప్రక్షాళన చేయడమే నా ముందున్న లక్ష్యాల్లో ఒకటి. రాష్ట్రంలో తిరిగి వ్యవస్థలను గాడిలో పెడుతున్నాం. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ లక్ష్యంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతా. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రీ-సర్వే ప్రక్రియ ద్వారా రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం.’’
సంక్షేమంలో వెనక్కి తగ్గేది లేదు
‘సంక్షేమ కార్యక్రమాల అమలులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.15 వేలు అందిస్తున్న ‘తల్లికి వందనం’ పథకం నాకు సంతృప్తిని ఇచ్చింది. భగవంతుడు కరుణించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఈ సాయాన్ని భవిష్యత్తులో మరింత పెంచుతాం. ‘క్యూఆర్ కోడ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భూములకు పూర్తి భద్రత కల్పిస్తూ రీసర్వే చేపడుతున్నాం. 2027 మార్చి నాటికి రాష్ట్రంలో ఎక్కడా భూవివాదాలు లేకుండా చేయడమే లక్ష్యం. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడం నా లక్ష్యం. ప్రసుత్తం రూ.3 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయాన్ని అప్పటికి రూ. 54 లక్షలకు పెంచాలనే దిశగా అడుగులు వేస్తున్నాం. పీ 4 ద్వారా పేద కుటుంబాలకు అండగా ఉంటున్నాం.’’
స్వచ్ఛాంధ్రలో కొత్త పుంతలు
‘‘గత ప్రభుత్వం వదిలేసిన చెత్తలో ఇప్పటికే 121 టన్నుల మేర చెత్తను తొలగించాం. జూన్ నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేస్తాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించడం ద్వారా గ్రామాలను ‘నెట్ జీరో వేస్ట్’గా మార్చడం నా లక్ష్యం. 2047 నాటికి గ్రీన్ కవర్‌ను 31.33 శాతం నుంచి 50 శాతానికి పెంచుతాం. ప్రతి నెల ఒకటో తేదీన నేరుగా నేనేప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నాను. రాష్ట్రంలో 24 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నాం. రిలయన్స్, టీసీఎస్ తిరిగి ఏపీకి వస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలు బతుకుదెరువు కోసం బయటకు వలస వెళ్లడం కాకుండా, ఇతర ప్రాంతాల వారే ఇక్కడకు వలస వచ్చేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. శ్రీకాకుళం ముఖచిత్రం మారుస్తాం. భోగాపురం, ఎయిర్‌పోర్టు, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల రాకతో ఉత్తరాంధ్ర దశ మారిపోనుంది.’’
ఆదర్శ వ్యక్తులకు సత్కారం
ప్రజా వేదికపై ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ సాధనకు సంబంధించి ఇద్దరు విద్యార్థినులు చేయించిన ప్రతిజ్ఞ సభికులను విశేషంగా ఆకట్టుకుంది. కంబకాయ గ్రామానికి చెందిన జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని భావనశ్రీ, బొరిగివలస గ్రామ జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థిని రాజ్యలక్ష్మి వేదికపైకి వచ్చి గంభీరంగా ప్రతిజ్ఞ చదివారు. వారు చదువుతుండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, సభకు హాజరైన ప్రజలందరూ వారితో గొంతుకలిపారు. అనంతరం ఆ విద్యార్థినులు సీఎం పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వారిని ఆప్యాయంగా పలకరించారు. ‘‘ఏం చదువుతున్నారు? పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారు?’’ అని కుశల ప్రశ్నలు వేశారు. ఒకరు కలెక్టర్ అవుదామని లక్ష్యంగా పెట్టుకున్నానని.. మరొకరు డాక్టర్ అవుదామనుకుంటున్నానని తెలిపారు. కాగా, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న పలువురిని ముఖ్యమంత్రి స్వయంగా సత్కరించి అవార్డులు ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్న పి.జయంతికి సీఎం ‘గ్రీన్ అంబాసిడర్’, ఎం.ఢిల్లేశ్వరరావుకు ‘స్వచ్ఛ రథం ఆపరేటర్’ అవార్డును అందజేశారు. ‘అమ్మ పెరటి తోట’ పేరుతో సేంద్రియ సాగు చేస్తున్న మహిళా రైతు వై.రాజ్యలక్ష్మిని సీఎం ప్రత్యేకంగా అభినందించి, అవార్డును ప్రదానం చేశారు. కాగా, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉత్తమ సేవలందించిన అధికారులను సీఎం సత్కరించారు. ‘పంచాయతీరాజ్ విత్ గుడ్ గవర్నెన్స్’ (సుపరిపాలన) విభాగంలో విశేష సేవలు అందించిన అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) సందీప్, అనకాపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్‌పీవో) శ్రీనివాస్‌ను శాలువతో సత్కరించారు.
ప్రధాని సూచన పాటిద్దాం...
‘‘పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన సూచనలను బాధ్యత గల పౌరులుగా అందరం పాటించి దేశానికి సహకరిద్దాం. వర్క్ ఫ్రం హోం అలవాటు చేసుకుని వీలైనంతవరకూ ఇంట్లో నుంచే పనిచేద్దాం. బంగారం కొనడం తగ్గిద్దాం. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్‌లోనే ప్రయాణిద్దాం. వంట నూనెల వాడకం తగ్గిద్దాం. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిద్దాం. మేడిన్ ఆంధ్రా, మేడిన్ ఇండియా బ్రాండ్లను కొనుగోలు చేద్దాం. టూరిజం కోసం విదేశీ పర్యటనల కంటే ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు ప్రజలు వెళ్లాలి.’’