Share News

చల్లపల్లి స్టేషన్‌లో భారీ పేలుడు

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:46 AM

కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. సీజ్‌ చేసిన మందుగుండు సామాగ్రిని నిర్వీర్యం చేయడానికి తీసుకెళ్లే క్రమంలో ఈ పేలుడు జరిగింది.

చల్లపల్లి స్టేషన్‌లో భారీ పేలుడు

  • మందుగుండు సామగ్రిని గదిలో పెడుతుండగా ఘటన

  • ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

  • హెచ్‌సీ, మహిళా కానిస్టేబుల్‌కు స్వల్పంగా..

  • పేలుడు ధాటికి పోలీస్‌ వాహనం ధ్వంసం

విజయవాడ/చల్లపల్లి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీ్‌సస్టేషన్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. సీజ్‌ చేసిన మందుగుండు సామాగ్రిని నిర్వీర్యం చేయడానికి తీసుకెళ్లే క్రమంలో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎస్‌ఐతోపాటు ఐదుగురు గాయపడ్డారు. గత ఏడాది అక్టోబరులో దీపావళి సందర్భంగా బాణసంచా, మందుగుండు సామాగ్రిని విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆ సమయంలో రెండు కేసుల్లో స్వాధీనం చేసుకున్న మందుగుండు సామాగ్రి (ఉల్లి బాంబులు)ని ఒక అట్టపెట్టెలో పెట్టి.. పోలీసు స్టేషన్‌ ఆవరణలోని ఒక చిన్న గదిలో భద్రపరిచారు. ఈ కేసుల్లో నిందితులకు కోర్టు జరిమానాలు విధించింది. ఈ మందుగుండు సామాగ్రిని నిర్వీర్యం చేయాలని కొద్దిరోజుల కిందట న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం.. గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలో సామాగ్రిని నిర్వీర్యం చేసినట్టుగా ఫొటోలను కోర్టుకు సమర్పించాలి. ఇందుకోసం పోలీసులు వీఆర్వోతోపాటు మధ్యవర్తులను మంగళవారం స్టేషన్‌కు పిలిపించారు. వారి సమక్షంలో గదిలో ఉన్న ఉల్లిబాంబుల పెట్టెను బయటకు తీసుకొచ్చారు. వీఆర్వో, మధ్యవర్తుల ముందు సామాగ్రిని ఉంచి ఫొటో తీయించుకున్నారు. ఆతర్వాత వీఆర్వో, మధ్యవర్తులు వెళ్లిపోయారు. కోర్టులో ఫొటోలు సమర్పించిన తర్వాత సామాగ్రిని నిర్వీర్యం చేద్దామని పోలీసులు భావించారు. ఈ క్రమంలో అట్టపెట్టెను కోర్టు వ్యవహారాలు చూసే కానిస్టేబుల్‌ షేక్‌ అబ్దుల్లా తిరిగి గదిలోకి తీసుకెళ్తున్నాడు. పెట్టె అడుగు భాగం పాడైపోవడంతో ఒక బాంబు జారి కింద పడింది. అక్కడే ఉన్న ఎస్‌ఐ డి.దుర్గాంజనేయులు దానిపై నీళ్లు చల్లించారు. దానితోపాటు పెట్టెలో ఉన్న అన్ని బాంబులపైనా నీళ్లు పోయమని చెప్పినా.. అలా జరగలేదు. తడిపిన బాంబును పెట్టెలో పెట్టి తీసుకెళ్తున్న క్రమంలో మరికొన్ని బాంబులు కిందపడిపోయాయి.


దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఎస్‌ఐ దుర్గాంజనేయులు, కానిస్టేబుల్‌ అబ్దుల్లా, డ్రైవర్‌ డి.నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. వారితోపాటు హెడ్‌కానిస్టేబుల్‌ కేటీడీవీ ప్రసాద్‌(తేజ), మహిళా కానిస్టేబుల్‌ కె.శివపార్వతి స్వల్పంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న పోలీసు వాహనం, పోలీస్ స్టేషన్ తలుపుల అద్దాలు, పక్కనే ఉన్న బ్యాంకు అద్దాలు ధ్వంసమయ్యాయి. రికార్డు గదిలోని సీలింగ్‌ ఊడిపోయింది. స్టేషన్‌ ఆవరణంతా చెల్లాచెదురైంది. ఎస్‌ఐ, కోర్టు కానిస్టేబుల్‌, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో వారిని, గ్రీన్‌చానల్‌ ద్వారా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, ఏఎస్పీ వీవీ నాయుడు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. క్లూస్‌ టీం రంగంలోకి దిగింది. ఈ ఘటనపై హోంమంత్రి అనిత, సీఎంవో, పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు.

Updated Date - Apr 01 , 2026 | 04:48 AM