Share News

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా విజయం సాధించాలి

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:06 AM

విద్యార్థులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా విజయం సాధించడానికి నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి తెలిపారు.

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా విజయం సాధించాలి

  • చలపతి యూనివర్సిటీ కార్యక్రమంలో విద్యార్థులకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ మధుమూర్తి సూచన

తాడికొండ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా విజయం సాధించడానికి నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.మధుమూర్తి తెలిపారు. గుంటూరు జిల్లా మోతడకలోని చలపతి యూనివర్సిటీలో బుధవారం ఇంజనీరింగ్‌ ప్రథమ సంవత్సరం తరగతుల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విజయం సాధించడానికి వ్యక్తిత్వం, పోటీతత్వం, సమాచారం, సృజనాత్మకత, నిబద్ధత అనే లక్షణాలను ఏర్పరుచుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో చలపతి యూనివర్సిటీ కూడా ఆధునిక వసతులు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌, క్వాంటం కంప్యూటింగ్‌ ప్రాధాన్యత, పారిశ్రామిక అనుబంధమైన కరిక్యులమ్‌తో విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.శివరాం ప్రసాద్‌ మాట్లాడుతూ ఆశలు, ఆకాంక్షలతో పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దాలన్నారు. పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని కాంక్షిస్తూ చలపతి యూనివర్సిటీలో చేర్చడం విశ్వసనీయతకు నిదర్శనమని తెలిపారు. చైర్మన్‌, చాన్సలర్‌ డాక్టర్‌ వై.వి.ఆంజనేయులు మాట్లాడుతూ ఆశలు, ఆశయాలు, సదుద్దేశంతో విద్యార్థుల తల్లిదండ్రులు చలపతి యూనివర్సిటీని ఎంపిక చేసుకున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సమర్ధవంతమైన టీమ్‌తో విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రో చాన్సలర్‌ వై.సుజిత్‌కుమార్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ నాదెండ్ల రామారావు, ప్రిన్సిపాల్‌ కె.నాగశ్రీనివాసరావు, డీన్స్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 04:07 AM