ఆర్డీటీ సేవలకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:06 AM
తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్డీటీ (రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్టు) కార్యకలాపాలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి.
ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ చేసిన కేంద్ర ప్రభుత్వం
రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్టు సేవలు పునరుద్ధరణ
అనంతపురం క్లాక్‌టవర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్డీటీ (రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్టు) కార్యకలాపాలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. అనంతపురం జిల్లా కేంద్రంగా నడుస్తున్న ఆర్డీటీకి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) రెన్యువల్ అయింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి ఆర్టీడీ కార్యాలయానికి సమాచారం అందింది. ఈ సంస్థకు విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన అనుమతులను ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయితే కూటమి ప్రభుత్వం కేంద్రంతో జరిపిన చర్చలు ఫలించాయి. ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ మంగళవారం ఉదయం ఈ విషయాన్ని వెల్లడించారు. మెయిల్ ద్వారా వచ్చిన రెన్యువల్ పత్రాన్ని చూపించి ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్డీటీ ఆసుపత్రులు, స్టేడియం, ఇతర సెక్టార్లలో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఇక ఆర్డీటీ సేవలకు, తమ ఉద్యోగాలకు ఇబ్బంది ఉండదని సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ కావడంతో.. ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ హుటాహుటిన అమరావతి రాజధానికి బయల్దేరి వెళ్లారు. మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
లోకేశ్ కృషితో ఆర్డీటీ సేవలు పునరుద్ధరణ: మంత్రి సవిత
రాయలసీమ గడ్డపై సేవ అనే పదానికి మారుపేరైన ఆర్డీటీ సేవలను పునరుద్ధరించడంలో మంత్రి లోకేశ్ కృషి ఎంతో ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆర్డీటీ సంస్థను కూడా రాజకీయ కక్షతో వేధించిందని, సంస్థ సేవలు ఆగిపోయేలా కుట్రలు చేసిందని విమర్శించారు. సంస్థ భూములు కబ్జా చేయాలని చూశారని, నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వారికి అండగా నిలిచిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ కృషితో ఆర్డీటీ సేవలు మళ్లీ గాడినపడ్డాయని హర్షం వ్యక్తం చేశారు.
మోదీ, అమిత్ షాకి సీఎం ధన్యవాదాలు
అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఆర్డీటీకి విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్య పరిష్కరించిన ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి వస్తున్న నిధులను నిలిపివేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయంతో ఈ సంస్థ సేవలకు అంతరాయం కలిగింది. అయితే సంస్థ అందిస్తున్న సేవలను వివరించి, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర హోంమంత్రికి విజ్ఞప్తి చేయగా.. ఆయన చూపిన ప్రత్యేక చొరవతో నేడు అడ్డంకులు తొలగిపోయాయి.’ అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, ప్రజల జీవితాల్లో భాగమైన ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చానని.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ మాట నిలబెట్టుకున్నానని మంత్రి లోకేశ్ అన్నారు.
పేదల ఊపిరి ఆర్డీటీ..!
1969లో అనంతలో స్థాపించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్
అనంతపురం క్లాక్‌టవర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): స్పెయిన్‌లో జన్మించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 1969లో అనంతపురం జిల్లాకు వచ్చారు. ఇక్కడ రూరల్ డెవల్‌పమెంట్ ట్రస్టు (ఆర్డీటీ)ను స్థాపించి పేదలకు సేవ చేయడం ప్రారంభించారు. ఆర్డీటీలో ప్రస్తుతం 3 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. లక్షలాది మంది పేదలు విద్య, వైద్య తదితర సేవలు అందుకుంటున్నారు. ఆర్డీటీ ప్రధానంగా విద్య, వైద్యం, మహిళా సాధికారత, దివ్యాంగుల అభివృద్ధి, పర్యావరణం-సుస్థిర జీవనోపాధి, గృహ నిర్మాణం, క్రీడలు వంటి ఏడు కీలక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోంది. అయితే, గతేడాది ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) అనుమతులను రెన్యువల్ చేయలేదు. దీంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆర్డీటీపై ఆధారపడ్డ వేలాది మందిలో ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు ఆర్డీటీకి మద్దతుగా గళం విప్పడం మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తదితరులు అవకాశం వచ్చిన ప్రతి చోటా గళం వినిపించారు. ఎట్టకేలకు ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ కావడంతో అందరిలోనూ హర్షం వ్యక్తమవుతోంది.
సమాజ శ్రేయస్సుకు కృషి..
ఆర్డీటీ వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, కణేకల్లులో ఆర్డీటీ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత వైద్యసేవలు అందిస్తోంది. బీసీ, మైనార్టీ, ఇతరులకు నామమాత్రపు ఫీజులు వసూలు చేస్తోంది. అలాగే పేదలకు ఉచిత విద్య అందించేందుకు అనేక గ్రామాల్లో పాఠశాలలు నిర్మించింది. ఇప్పటి వరకు 5,069 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించింది. వీరిలో 2వేల మందికి పైగా ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అనంతపురం పంగల్‌రోడ్డు, బుక్కరాయసముద్రం, కూడేరు, బత్తపల్లి, కణేకలు, నంద్యాల జిల్లా శ్రీశైలం, దోర్నాలలో డిజేబుల్డ్ ఇనిక్లూజివ్ డెవల్‌పమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వేలాది మంది దివ్యాంగ విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యసేవలు, ఫిజియోథెరఫీ అందిస్తోంది.