Share News

అడవి నుంచి గిరిజనులను తరిమేస్తే ఎలా?

ABN , Publish Date - May 06 , 2026 | 04:40 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులైన గిరిజన కుటుంబాలను ఏజెన్సీ ప్రాంతం నుంచి దూరంగా తరిమేస్తే ఎలా? అని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ..

అడవి నుంచి గిరిజనులను తరిమేస్తే ఎలా?

  • నిర్వాసితులకు అడవిలోకి వెళ్లే హక్కు కల్పిస్తున్నారా?

  • రాష్ట్రాన్ని ప్రశ్నించిన మోటా సెక్రటరీ రంజనా చోప్రా

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్వాసితులైన గిరిజన కుటుంబాలను ఏజెన్సీ ప్రాంతం నుంచి దూరంగా తరిమేస్తే ఎలా? అని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మోటా) కార్యదర్శి రంజనా చోప్రా రాష్ట్రాన్ని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు, సహాయ కార్యక్రమాలపై రాష్ట్ర అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా రంజనా చోప్రా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌ఆర్‌ అధికారి అభిషేక్‌ మాట్లాడుతూ వచ్చే ఏడాది జూన్‌ నాటికి ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తికానున్న నేపథ్యంలో నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలను వేగంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రంజనా జోక్యం చేసుకుంటూ ఇంతకాలం అడవితో సహవాసం చేసిన గిరిజనులను ఎక్కడో దూర ప్రాంతానికి పంపిస్తే ఎలా? అని ప్రశ్నించారు. అటవీ ఉత్పత్తులను సేకరించుకునేందుకు అడవిలోకి వెళ్లేందుకు గిరిజనులను అనుమతిస్తున్నారా.. లేదా? అని ప్రశ్నించారు. వరద ప్రభావం లేని ప్రాంతానికి నిర్వాసితులను తరలిస్తున్నామని అధికారులు చెప్పగా.. దీనివల్ల గిరిజనులు వారి సంస్కృతీ సంప్రదాయాలకు క్రమంగా దూరమైపోరా? అని సందేహం వ్యక్తం చేశారు. ఇది సామాజికంగా, ఆర్థికంగా సరైనదేనా? అని ప్రశ్నించారు. గిరిజనులను సంప్రదాయ వృత్తులకు దూ రం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని తొలి దశ, రెండో దశ అంటూ విభజించడం ఎందుకని రంజనా చోప్రా అడిగారు.

Updated Date - May 06 , 2026 | 04:42 AM