పొగాకు రైతు సమస్యపై కదిలిన కేంద్రం
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:40 AM
రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితిన్‌కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్‌లను రాష్ట్రానికి పంపింది.
రాష్ట్రానికి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు
సీఎం చంద్రబాబుతో భేటీ.. పొగాకు సమస్యపై చర్చ
రైతులను ఆదుకునేందుకు మూడు ప్రతిపాదనలు
శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
అందరి భాగస్వామ్యంతో తుది నిర్ణయం: సీఎం
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితిన్‌కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్‌లను రాష్ట్రానికి పంపింది. శనివారం ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు సీఎం చంద్రబాబుతో కేంద్ర ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, పొగాకు బోర్డు ఉన్నతాధికారులు పాల్గొనగా, మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు సిద్ధం చేసిన మూడు ప్రతిపాదనలపై సీఎంతో కేంద్ర అధికారులు చర్చించారు. వడ్డీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ రుణాల జారీ, ప్రోత్సాహకాలు, ధర లోటు భర్తీ.. వంటి ప్రతిపాదనలను కేంద్ర ప్రతినిధులు సీఎంకు వివరించారు. వీటిపై పూర్తిస్థాయిలో చర్చించాలని, ఏ నిర్ణయం తీసుకున్నా.. పొగాకు రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రతి ఏడాది ఇదే సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం నుంచి ఏమేరకు సాయం అందించగలరో.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించి, తుది నిర్ణయానికి రావాలన్నారు. పొగాకు పంటను ఒకటి రెండేళ్లు నిల్వ ఉంచే అవకాశాలున్నాయా? ధర స్థిరపడిన తర్వాత విక్రయించుకోవచ్చా? అనే అంశాలను కూడా పరిశీలించాలన్నారు.
లోగ్రేడ్, మీడియం గ్రేడ్, హైగ్రేడ్ పొగాకును మార్కెట్‌లో ఎలా విక్రయించాలనే దానిపైనా ట్రేడర్లతో మాట్లాడి, కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రైతుల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ట్రేడర్ల అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుని, ఓ నిర్ణయానికి వస్తే.. భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చక్కటి విధానాన్ని రూపొందించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లీడ్ తీసుకుని, చర్చలను కొనసాగించాలని సూచించారు.
ట్రేడర్లతో కేంద్రమంత్రి భేటీ
సీఎం చంద్రబాబు సూచనల మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, పొగాకు ట్రేడర్లతో కేంద్ర మంత్రి చంద్రశేఖర్ సమావేశమయ్యారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పొగాకు బోర్డు ముందుకు వచ్చాయని, రైతులకు మేలు చేసేలా ట్రేడర్లు కూడా ఓ అడుగు ముందుకు వేయాలని కేంద్ర మంత్రి సూచించారు. రైతులు నష్టపోకుండా ట్రేడర్ల వైపు నుంచి ఏమేమి చేయగలరనే అంశాన్ని చర్చించుకుని, మంచి ప్రతిపాదనతో ముందుకు రావాలని కోరారు. సోమవారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.