నిధులకు ఇబ్బంది లేదు!
ABN , Publish Date - May 02 , 2026 | 04:55 AM
పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2027 జూన్ నాటికి పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు తగు సహకారం అందించాలని కేంద్ర సంస్థలను కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఆదేశించారు.
పోలవరంపై కేంద్రం స్పష్టీకరణ.. మరో 3,300 కోట్లు ఇచ్చేందుకు ఓకే
పనుల్లో వేగం పెంచండి.. రాష్ట్ర అధికారులకు నిర్దేశం
కేంద్ర సంస్థలతో ఢిల్లీలో కాంతారావు సమీక్ష
సీఎస్ సాయిప్రసాద్ బృందం హాజరు
నెలకు 500 కోట్లయినా ఖర్చు పెట్టరేం?
తొలి దశ 2027 జూన్‌కి పూర్తికావాలి
పొరుగు రాష్ట్రాల అభ్యంతరాల సంగతి మేం చూసుకుంటాం.. వేగం పెంచండి
భూసేకరణ, పునరావాసం స్పీడూ పెరగాలి
అమరావతి/న్యూఢిల్లీ, మే 1 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2027 జూన్ నాటికి పూర్తి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు తగు సహకారం అందించాలని కేంద్ర సంస్థలను కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తికి నిధుల కొరత ఉండదని.. ఇప్పటికే అడ్వాన్సుగా ఇచ్చిన రూ.2,800 కోట్లలో 75 శాతం ఖర్చుపెడితే.. మరో 3,300 కోట్లు విడుదల చేస్తామన్నారు. శుక్రవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో ఆయన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), వాప్కోస్, సెంట్రల్ వాటర్-పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఎంఆర్‌ఎస్), కేంద్ర జల సంఘం, కేంద్రపర్యావరణం-అటవీశాఖ, కేంద్ర భూసేకరణ, సహాయపునరావాస శాఖ, సీఎ్‌సఎంఆర్‌ఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలవనరుల బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కమిషనర్ ప్రశాంతి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, పీపీఏ సీఈ రమేశ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు. దాదాపు గంటన్నర జరిగిన సమావేశంలో.. ప్రాజెక్టు మొదటి దశ పనుల పురోగతి, భూసేకరణ, పునరావాసం, రెండో దశలో భూసేకరణ పరిహారం, సహాయ పునరావాస కార్యక్రమాలపై చర్చించారు. నెలవారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని జలశక్తి అధికారులు సూచించినట్లు తెలిసింది. కీలకమైన డయాఫ్రం వాల్ పూర్తయిందని, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం పనుల్లో వేగం కనిపిస్తోందంటూ కాంతారావు సంతృప్తి వ్యక్తం చేసినా.. నిధులున్నా వ్యయం చేయకపోవడంపై పెదవివిరిచారు. నెలకు రూ.500 కోట్లయినా ఖర్చు చేయలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిధుల కోసం ఎప్పుడు అభ్యర్థన లేఖ ఇస్తారని సీఎ్‌సను ప్రశ్నించారు. ఈ ఏడాది సెప్టెంబరునాటికి గతంలో ఇచ్చిన అడ్వాన్సులో 75 శాతం వ్యయమవుతాయని.. ఆ వెంటనే నిధుల కోసం లేఖ రాస్తామని సాయిప్రసాద్ తెలిపారు. అప్పుడు ఇంకో రూ.3300కోట్లు అడ్వాన్సు మంజూరు చేస్తామని కాంతారావు చెప్పారు. ఈ 6100 కోట్లనూ ఖర్చు చేశాక అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని నిధులు కావాలన్నా మంజూరుకు కేంద్రం సిద్ధంగా ఉందని, 2027 జూన్ నాటికి తొలిదశ పూర్తిచేయాలన్నారు.
భూసేకరణ, పునరావాసంలో వెనుకంజ..
తొలిదశలో భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లో వెనుకబడ్డారని కాంతారావు అన్నారు. భూసేకరణ దాదాపు పూర్తయిందని, గిరిజన ప్రాంతాల్లో పునరావాస కాలనీల నిర్మాణం, నిర్వాసితుల తరలింపు కొంత నెమ్మదిగా సాగుతున్నాయని కమిషనర్ ప్రశాంతి చెప్పారు. 2027 జూన్ నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. భూసేకరణ, సహాయ పునరావాస పనుల ప్రగతిని ఇకపై పీపీఏ, వాప్కోస్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని కాంతారావు ఆదేశించారు. సీఎ్‌సఎంఆర్‌ఎస్ అధికారులు నెలలో రెండు సార్లయినా ప్రాజెక్టును సందర్శించాలన్నారు. ముంపు సమస్యపై ఒడిసా, ఛత్తీ్‌సగఢ్, తెలంగాణ అభ్యంతరాల పరిష్కారానికి కేంద్రం చొరవ తీసుకుంటుందని.. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
జిలెటిన్ స్టిక్స్, డీజిల్ కొరత!
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా జిలెటిన్ స్టిక్స్ దిగుమతి నిలిచిపోయిందని సాయిప్రసాద్ తెలిపారు. డీజిల్ కొరత సమస్య ప్రాజెక్టుపై పడిందన్నారు. రోజూ బల్క్‌లో 50,000 లీటర్ల డీజిల్ అవసరం కాగా.. రెండు వారాలుగా ఏడెనిమిది వేల లీటర్లలోపే అందుతోందని చెప్పారు. మే నెలాఖరుకు ఎగువ నుంచి వరద వస్తుందని.. ఈలోపే గ్యాప్-1, గ్యాప్-2 వద్ద పనుల వేగాన్ని పెంచి.. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం ఎత్తు కనీసం 30మీ. వరకు పూర్తిచేయాలని అనుకున్నామని ఈఎన్‌సీ నరసింహమూర్తి చెప్పా రు. డీజిల్ కొరత కారణంగా పనులు నిలిచిపోయాయన్నారు. డీజిల్, జిలెటిన్ స్టిక్స్ వంటి సమస్యలు ఎదురైనప్పుడు తక్షణం తమదృష్టికి తీసుకురాకపోతే, అవి పరిష్కారమెలా అవుతాయని కాంతారావు ప్రశ్నించారు. బల్క్ డీజిల్‌పై ఏలూరు కలెక్టరుతో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు. జిలెటిన్ స్టిక్స్ దిగుమతిపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని పీపీఏని ఆదేశించారు. భద్రాచలం ముంపు గ్రామాలపై కూడా చర్చ జరిగింది.