Share News

పోలవరం తొలిదశకు 30,436 కోట్లు

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:38 AM

పోలవరం ప్రాజెక్టు మొదటి దశ (41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ) నిర్మాణానికి 2023 ధరల ప్రాతిపదికన రూ.30,436.95 కోట్ల నిధులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌ భూషణ్‌ చౌదరి తెలిపారు.

పోలవరం తొలిదశకు 30,436 కోట్లు

  • ఇంకా 12,157 కోట్లు ఇవ్వాలి: కేంద్రం

  • 2027 జూన్‌ నాటికి 41.15 మీటర్ల నీటి నిల్వ లక్ష్యం

  • గడువు ప్రకారం పురోగతిలో పనులు

  • పోలవరం-బనకచర్ల ప్రతిపాదనలు వెనక్కి

  • లోక్‌సభలో కేంద్ర మంత్రులు వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు మొదటి దశ (41.15 మీటర్ల ఎత్తు వరకు నీటి నిల్వ) నిర్మాణానికి 2023 ధరల ప్రాతిపదికన రూ.30,436.95 కోట్ల నిధులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌ భూషణ్‌ చౌదరి తెలిపారు. ఇందులో మిగిలిన కేంద్ర గ్రాంట్ల పరిమితి రూ.12,157.53 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. గురువారం లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.5512.40 కోట్లు, 2025-26లో రూ.2810.22 కోట్ల నిధులను విడుదల చేసినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే లక్ష్యం నిర్దేశిత గడువు ప్రకారం పురోగతిలో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. గ్యాప్‌-1, గ్యాప్‌-2లలో ప్రధాన డ్యామ్‌ నిర్మాణం, భూసేకరణ(ఎల్‌ఏ), పునరావాస, పునర్నిర్మాణ(ఆర్‌అండ్‌ఆర్‌) పనులను 2027 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. అలాగే 45.72 మీటర్ల పూర్తి రిజర్వాయర్‌ మట్టానికి (ఎఫ్‌ఆర్‌ఎల్‌) కావలసిన సివిల్‌ పనులు, 41.15 మీటర్ల పరిధిలోని భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులతో పాటు ఎడమ, కుడి ప్రధాన కాలువల పనులకు కేంద్ర గ్రాంట్‌ వర్తిస్తుందని వివరించారు. జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికయ్యే ఖర్చును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం సాంకేతిక, నిధుల వినియోగ పత్రాలను నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు అందజేస్తోందని తెలిపారు. వాటిని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పరిశీలించిన అనంతరమే తదుపరి నిధులను విడుదల చేస్తుందని వివరించారు.


ఆ ప్రతిపాదనలు వెనక్కి

పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలను నిపుణుల అంచనా కమిటీ(ఈఏసీ) ఏపీ ప్రభుత్వానికి తిప్పి పంపిందని కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టు 1980 నాటి గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్‌(జీడబ్ల్యూడీటీ) అవార్డును ఉల్లంఘించేలా ఉందంటూ అభ్యంతరాలు వచ్చినట్లు వెల్లడించింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) అధ్యయనానికి టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌(టీఓఆర్‌) మంజూరు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం జూన్‌ 5న ప్రతిపాదనలు పంపిందని మంత్రి తెలిపారు. జూన్‌ 17న ఈఏసీ వీటిని పరిశీలించిందన్నారు. టీఓఆర్‌ దరఖాస్తు చేసేముందు అంతర్రాష్ట్ర అంశాలను పరిశీలించుకోవాలని, సీడబ్ల్యూసీ నుంచి ఎన్‌ఓసీతో పాటు క్లియరెన్సులు తీసుకోవాలని ఏపీకి సూచించినట్లు చెప్పారు.

Updated Date - Aug 07 , 2026 | 04:39 AM