Share News

అన్నదాతకు స్వల్ప ఊరట

ABN , Publish Date - May 14 , 2026 | 05:13 AM

దేశంలో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో కేంద్రం 14 రకాల పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లో రాష్ట్రంలో అన్నదాతలకు స్వల్పంగానే ఊరట లభించింది.

అన్నదాతకు స్వల్ప ఊరట

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): దేశంలో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో కేంద్రం 14 రకాల పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లో రాష్ట్రంలో అన్నదాతలకు స్వల్పంగానే ఊరట లభించింది. రాష్ట్రంలో ఎక్కువగా పండే వరి, మొక్కజొన్న పంటలకు ఎమ్మెస్పీని స్వల్పంగానే పెంచారు. అన్నిటి కన్నా అత్యధికంగా రూ. 622 సన్‌ఫ్లవర్‌ గింజలకు ఎమ్మెస్పీ ప్రకటించారు. ఈ పంట రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలోనే ఉంటుంది. అలాగే వలిశెలు (నైజర్‌)కు రూ. 515 పెంచారు. మన రాష్ట్రంలో వలిశెలను చాలా తక్కువగానే సాగు చేస్తారు. వరిలో సాధారణ రకమైనా, ఎ-గ్రేడ్‌ రకమైనా రూ. 72 మాత్రమే పెరిగింది. దీంతో క్వింటాల్‌ ధర సాధారణ రకం రూ. 2,441, ఎ-గ్రేడ్‌ రకం 2,461కి చేరింది. మొక్కజొన్నకు రూ. 10, పెసరకు రూ. 12 చొప్పున మాత్రమే మద్దతు దక్కింది. జొన్న, రాగులు, కందులు, మినుములు విషయంలో కాస్త ఫర్వాలేదన్నట్లుగా పెంపుదల ఉంది. నూనెగింజల పంటలకు ఎక్కువగా పెంచారు. రైతుల పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలు అందేలా చూసేందుకు ఎమ్మెస్పీని పెంచినట్లు కేంద్రం పేర్కొంది. ఉత్పత్తి వ్యయం విషయంలో పెసరపై 61శాతం, సజ్జ, మొక్కజొన్నపై 56శాతం, కందులపై 54శాతం, మినుముపై 61శాతం, మిగిలిన పంటలపై కనీసం 50 శాతం పైన ఎమ్మెస్పీ ఉంటుందని కేంద్ర క్యాబినెట్‌ కమిటీ అభిప్రాయపడింది. కానీ ఏటేటా సాగు ఖర్చులు పెరుగుతున్నా.. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా జాతీయ స్థాయి గణాంకాలతో కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటిస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. 2025-26లో దాదాపు ఏ పంటకు మద్దతు ధర లభించలేదని చెబుతున్నారు. ఈ ఏడాదైనా మద్దతు ధర అమలయ్యేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రైతు సంఘాలు కోరుతున్నాయి.

రైతులకు ఎన్డీయే అత్యంత ప్రాధాన్యం: అచ్చెన్న

రైతు సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. 2026-27 ఖరీఫ్‌ సీజన్‌కు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల పెంపు రైతులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయమని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పెట్టుబడి ఖర్చుకు కనీసం 50 శాతం లాభం జోడించి, ఎమ్మెస్పీ నిర్ణయించడం రైతులకు నిజమైన భరోసా ఇచ్చే చర్యగా అభివర్ణించారు.

Updated Date - May 14 , 2026 | 05:13 AM