ఏపీకి రూ.40 వేల కోట్లు
ABN , Publish Date - Feb 09 , 2026 | 04:57 AM
కేంద్ర బడ్జెట్‌లో రాష్ర్టానికి రూ.40 వేల కోట్ల మేర కేటాయింపులు జరిగాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి: మంత్రి పెమ్మసాని
మద్దిలపాలెం (విశాఖపట్నం), ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో రాష్ర్టానికి రూ.40 వేల కోట్ల మేర కేటాయింపులు జరిగాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్థానిక మద్దిలపాలెం కాకతీయ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర బడ్జెట్‌పై మంత్రి విశ్లేషించారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు రూ.10,134 కోట్లు కేటాయించడంతోపాటు రాష్ట్రం మీదుగా హైస్పీడ్ రైల్వే లైన్ వస్తుందన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.1,128.91 కోట్లు, రాజధాని ప్రాంతంలో సమీకృత పట్టాణాభివృద్ధికి రూ.432.09 కోట్లు, గ్రామీణ రహదారులకు రూ.500.99 కోట్లు కేటాయించిందని, ఇంకా మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పెద్ద పీట వేసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.3,320 కోట్లు కేటాయించారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ప్రాంతీయ రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు 4 వేల ఎలక్ర్టిక్ బస్సులు కేటాయించారన్నారు. మునిసిపల్ బాండ్ల ద్వారా రూ.300 కోట్లు వస్తాయని, విశాఖ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు వచ్చే అవకాశముందని తెలిపారు. అరకులో పర్యావరణహితమైన ట్రెకింగ్, పులికాట్ సరస్సు వద్ద పక్షుల పరిశీలన వంటి కార్యక్రమాలతో టూరిజం అభివృద్ధికి కేంద్రంనాంది పలికిందని పెమ్మసాని వెల్లడించారు.