పోలవరానికి సంపూర్ణ సహకారం!
ABN , Publish Date - Feb 01 , 2026 | 03:47 AM
పోలవరం ప్రాజెక్టును కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. చివరి అంకంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అవరోధాలూ ఎదురు కాకుండా చూడాలంటూ కేంద్ర ఆర్థిక, జల శక్తి శాఖలను ఆదేశించింది.
రూ.3 వేల కోట్ల విడుదలకు కేంద్రం అంగీకారం
రూ.1500 కోట్ల చొప్పున రెండు విడతల్లో..
డ్యామ్ పనులపై ఆరా తీసిన కేంద్ర జలశక్తి శాఖ
ఆ శాఖ జాయింట్ సెక్రటరీతో ఇంజనీర్ ఇన్ చీఫ్
నరసింహమూర్తి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి భేటీ
డిజైన్లకు త్వరలోనే ఆమోదం: జలశక్తి శాఖ
అమరావతి, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. చివరి అంకంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అవరోధాలూ ఎదురు కాకుండా చూడాలంటూ కేంద్ర ఆర్థిక, జల శక్తి శాఖలను ఆదేశించింది. ఇటీవల అమరావతిలో 14 బ్యాంకుల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు, పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరా తీశారు. అప్పటి షెడ్యూల్‌ను బట్టి 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని ఆమెకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అయితే..గోదావరి పుష్కరాల నాటికే పోలవరాన్ని పూర్తి చేయాలని సీఎంకు నిర్మల సూచించారు. దీంతో.. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తి చేయాలంటూ జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థలకు చంద్రబాబు నిర్దేశించారు. గత నెల పోలవరం ప్రాజెక్టు క్షేత్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు, కీలకమైన డయాఫ్రమ్ వాల్ ఫిబ్రవరి నెలాఖరునాటికి పూర్తవుతుందని ..గ్యాప్ -1, గ్యాప్-2 పనులు సహా డయాఫ్రమ్‌వాల్‌పై ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయగలమని కాంట్రాక్టు సంస్థ తెలిపింది. గత నెలలో పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం అధికారులతో 2027 మార్చినాటికి పోలవరం తొలిదశ 41.15 మీటర్ల కాంటూరులో పూర్తి చేస్తామని పోలవరం ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు.
కాగా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో ఎలాంటి అవరోధాలు రానివ్వబోమని రాష్ట్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలశక్తి శాఖ స్పష్టంచేసింది. శుక్రవారం జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి కాంతారావును ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ కలిశారు. మూడో విడత కింద రూ. 3,000 కోట్లు ఇవ్వాలని కాంతారావును రొనాల్డ్ రోస్ కోరారు. ఈ నిధులు మంజూరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంతారావు వివరించారు. చెరో రూ.1,500కోట్లు చొప్పున రూ.3,000 కోట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనుల తీరుపై నరసింహమూర్తిని కాంతారావు ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది మార్చి లేదా జూన్ నాటికి పూర్తి చేస్తామని నరసింహమూ ర్తి ధీమా వ్యక్తంచేశారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ డిజైన్లను కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉం దని నరసింహమూర్తి వివరించారు. దీంతో .. నిధుల విడుదలతో సహా డిజైన్లను కూడా వీలైనంత వేగంగా ఆమోదం తెలుపుతామని కాంతారావు హామీ ఇచ్చారు.