Share News

ఇలా ఇచ్చి.. అలా లాగేశారు!

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:08 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధుల విషయంలో కేంద్రం దోబూచులాడుతోంది.

ఇలా ఇచ్చి.. అలా లాగేశారు!

  • ఉపాధి మెటీరియల్‌ నిధులపై కేంద్రం దోబూచులాట

  • కేంద్ర మంత్రి పెమ్మసాని జోక్యం చేసుకోవాలని వినతి

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధుల విషయంలో కేంద్రం దోబూచులాడుతోంది. రాష్ట్రానికి రూ.480 కోట్ల మెటీరియల్‌ నిధులు విడుదల చేస్తూ జనవరి 27న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతలోనే పొరపాటున ఉత్తర్వులు ఇచ్చామని, మెటీరియల్‌ నిధులు మీకు ఇప్పుడే ఇవ్వడం కుదరదని చెబుతూ ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో విడత మొదటి భాగంగా రూ.480 కోట్లు, పాత బకాయిలు మరో రూ.75 కోట్లు కలిపి సుమారు రూ.556 కోట్లు స్పర్శ అకౌంట్‌ ద్వారా విడుదల చేస్తూ జనవరి 27న ఆదేశాలిచ్చింది. ఈ ఉత్తర్వులను ఎన్‌ఆర్‌ఈజీఏ వెబ్‌సైట్‌లో కూడా పెట్టారు. ఈ నిధులకు రాష్ట్ర వాటా కూడా కలిపి మొత్తం రూ.740 కోట్లు చెల్లింపులు చేసే అవకాశం ఉంది. దీంతో గతేడాది అక్టోబరు వరకూ ఉపాధి పథకంలో మెటీరియల్‌ పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించే అవకాశం ఏర్పడిందని గ్రామీణాభివృది ్ధశాఖ అధికారులు భావించారు. అయితే నిధులు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి లాగేసుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఈ పనులు చేపట్టిన వెండర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పల్లెపండుగ 1.0 కింద రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్‌ రోడ్లు, మినీ గోకులాల నిర్మాణ పనులకు ఇప్పటికీ బిల్లులు పూర్తిగా చెల్లించలేదు. తాజాగా పల్లెపండుగ 2.0 పనులు కూడా భారీగా చేపడుతున్నారు. రాష్ట్రానికి సుమారు రూ.2వేల కోట్ల వరకూ బిల్లులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ కేంద్ర అధికారులు రాష్ట్రంపై చిన్నచూపు చూస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ జోక్యం చేసుకుని రాష్ట్రానికి ఉపాధి మెటీరియల్‌ నిధులు తిరిగి మంజూరు చేయించాలని కోరుతున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 04:09 AM