Share News

మరో సూపర్‌ ఆఫర్‌!

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:03 AM

ఏపీకి మరో బంపర్‌ ఆఫర్‌ లభించింది. వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ సురక్షిత కుళాయి నీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి భరోసా ఇస్తూ, జల్‌జీవన్‌ మిషన్‌ కింద గతంలో ...

మరో సూపర్‌ ఆఫర్‌!

  • జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ఏపీకి 13 వేల కోట్లు

  • వైసీపీ హయాంలో ఆగిపోయిన స్కీమ్‌ నిధులు

  • నాడు 27,248 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

  • కానీ రాష్ట్రం వాటా చెల్లించని జగన్‌ ప్రభుత్వం

  • దీంతో రూ.4,235 కోట్లు మాత్రమే వినియోగం

  • అలా ఆగిన సుమారు 23 వేల కోట్లలో కేంద్రం వాటా 13 వేల కోట్లు

  • వాటి మంజూరుకు మోదీ సర్కారు సమ్మతి

  • వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి లక్ష్యం

అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఏపీకి మరో బంపర్‌ ఆఫర్‌ లభించింది. వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ సురక్షిత కుళాయి నీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి భరోసా ఇస్తూ, జల్‌జీవన్‌ మిషన్‌ కింద గతంలో ఆగిన సుమారు రూ.23వేల కోట్లను కేంద్రం మంజూరు చేయనుంది. ఇందులో సుమారు రూ.13 వేల కోట్ల దాకా రాష్ట్రానికి కేంద్ర వాటాగా లభించనున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాల నుంచి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, జలవనరుల శాఖకు మరో రూ.10 వేల కోట్లు ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు మరో రూ.13 వేల కోట్లు రానుండటంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. వైసీపీ హయాంలో జల్‌జీవన్‌ మిషన్‌ పథకం కింద కేంద్రం రూ.27,248 కోట్లు మంజూరుచేసింది. అయితే, రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేవలం రూ.4,235 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. సుమారు రూ.23 వేల కోట్లు వినియోగించుకోలేకపోయింది. ఈ పథకం కింద చేపట్టాల్సిన ప్రతి ఇంటికీ కుళాయి పనులు అటకెక్కాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సమీక్షలు నిర్వహించారు. పలు దఫాలు కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులతో చర్చించారు. ఉప ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రితో సమావేశమై హామీ పొందారు. ఈ క్రమంలోనే జల్‌జీవన్‌ మిషన్‌ పనులు కొనసాగించేందుకు ఏపీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.


నాడు హడావుడి ఎక్కువ.. పనులు తక్కువ..

రాష్ట్రంలో 95.44 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా, 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు అందించారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.39.30 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలిగింది. సకాలంలో మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడంతో కేవలం ఐదు జిల్లాల్లో మాత్రమే 90 శాతానికి పైగా ట్యాప్‌ కనెక్షన్లు పూర్తయ్యాయి. ఈ ఐదేళ్లలో ఈ పథకంలోకి సుమారు మూడు లక్షల ఇళ్లు కొత్తగా చేరాయి. పాత టార్గెట్‌తో (28 లక్షలు) పాటు వీటినీ కలుపుకొంటే 31 ఇళ్లకు అందించాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వ అలసత్వం, మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడం కారణంగా పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2027 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీరు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.


అంతా అడ్డగోలుగా..

అప్పట్లో రాష్ట్రంలో జల్‌జీవన్‌ మిషన్‌ నిధులతో చేపట్టిన తాగునీటి సరఫరా పనులను గ్రామ జల సంఘాలకు అప్పగించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. జల్‌జీవన్‌ మిషన్‌ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లే లేరని ఒకసారి.. ఉన్నా కొద్దిమందే ఉన్నారని మరోసారి సాకులు చెప్పింది. అర్హత లేకపోవడం వల్ల, అర్హత ఉన్న కొంత మంది కూడా ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల టెండర్లలో పాల్గొనలేదని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ.. పంచాయతీరాజ్‌ శాఖకు అప్పట్లో నివేదించారు. అయితే, జల పథకాలకు సంబంధించి నాడు వైసీపీ చేసిన ప్రయోగాలన్నీ విఫలం కావడంతో పరిస్థితి మొదటికొచ్చింది. జల సంఘాల ముసుగులో ఎన్నికల సమయంలో గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలకు కాంట్రాక్టు పనులు అప్పచెప్పారు. కాగా, ఈ పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో ఖర్చు చేయకపోవడం, రాష్ట్ర వాటా చెల్లించకపోవడం, ఈ వాటా చెల్లింపు కోసం నాబార్డు వద్ద తీసుకున్న అప్పును కూడా ఉపయోగించకపోవడం తదితర కారణాల వల్ల కేంద్రం నుంచి జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు నాడు ఆగిపోయాయి.

Updated Date - Jan 28 , 2026 | 04:04 AM