పోలవరం నాణ్యతపై కేంద్రం ఆరా!
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:30 AM
పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేసే దిశగా ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థలు నిర్మాణంలో వేగాన్ని పెంచుతుంటే..
25న ప్రాజెక్టు ప్రాంతానికి రానున్న జలశక్తి శాఖ కార్యదర్శి, పీపీఏ సీఈవో
డయాఫ్రం వాల్, గ్యాప్-1, 2 పనుల పరిశీలన
ప్రస్తుతం పోలవరంలోనే సీఎస్ఎంఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు
గ్యాప్-1, గ్యాప్-2లో వాడే మెటీరియల్ పరీక్ష
అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేసే దిశగా ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టు సంస్థలు నిర్మాణంలో వేగాన్ని పెంచుతుంటే.. ఈ కీలక తరుణంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన పురోగతి ఎలా ఉందో పరిశీలించేందుకు కేంద్ర జలశక్తి శాఖ సిద్ధమైంది. ఆ శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో యోగేశ్ పైథాంకర్ ప్రాజెక్టు ప్రాంతానికి రానున్నారు. అధికారులతో సమీక్షించనున్నారు. యోగేశ్ ఈ నెల 24న రాజమహేంద్రవరం చేరుకుంటారు. 25వ తేదీన వీఎల్ కాంతారావు వస్తారు. ఇద్దరూ కలిసి అదే రోజు పోలవరం ప్రాజెక్టు క్షేత్ర ప్రాంతానికి వెళ్తారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలిస్తారు. అదేవిధంగా ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మించే గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతంలో వినియోగిస్తున్న మట్టి, రాళ్ల నాణ్యతను కూడా పరిశీలిస్తారు. వారు గమనించిన అంశాలను జలశక్తి శాఖ రికార్డు చేస్తుంది. వీటిని నివేదిక రూపంలో తయారుచేస్తుంది.
పురోగతి బాగుంది: సీఎస్ఎంఆర్‌ఎస్ డైరెక్టర్
కేంద్ర జలశక్తి కార్యదర్శి 25వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో.. సెంటర్ ఫర్ సాయిల్ అండ్ మినరల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్‌ఎస్) డైరెక్టర్ ఆర్.చిత్ర సహా ఆరుగురు శాస్త్రవేత్తల బృందం సోమవారం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంది. డయాఫ్రం వాల్, ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనుల్లో పురోగతి బాగుందని ప్రశంసించింది. ఈ బృందం గ్యాప్-1, గ్యాప్-2లో మెటీరియల్ శాంపిళ్లను తీసుకుని నాణ్యత నిర్ధారణ కోసం టెస్టింగ్ ల్యాబ్‌కు పంపింది. ఈ రిపోర్టులు మంగళవారం వస్తాయని ఇంజనీరింగ్ వర్గాలు వెల్లడించాయి.