వైసీపీకి కేంద్రం ఝలక్
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:03 AM
సోషల్ మీడియాలో రోతరాతలు, చెత్త పోస్టులు పెడుతూ సోషల్ సైకోలు రెచ్చిపోతున్నారు. వీరిలో అత్యధికులు వైసీపీ కోసం పనిచేస్తున్నవారే. అసభ్యకర పోస్టులు, బూతుపురాణాలతో గీతదాటిన సైకోలను కూటమి ప్రభుత్వం...
సోషల్ సైకోలకు పార్లమెంటులో వైవీ సుబ్బారెడ్డి వత్తాసు
రాజ్యాంగ పాఠాలు గుర్తు చేసిన కేంద్రం
అమరావతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో రోతరాతలు, చెత్త పోస్టులు పెడుతూ సోషల్ సైకోలు రెచ్చిపోతున్నారు. వీరిలో అత్యధికులు వైసీపీ కోసం పనిచేస్తున్నవారే. అసభ్యకర పోస్టులు, బూతుపురాణాలతో గీతదాటిన సైకోలను కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరెస్టు చేస్తోంది. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ ఈ అరెస్టులను జాతీయస్థాయిలో హైలైట్ చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లాలనుకుని వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాపైంది. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ రోతరాతలకు అందమైన ముసుగేసి రాజ్యసభలో ఒక ప్రశ్న అడిగారు. ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలును ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయని అన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రాలవారీగా, నెలవారీగా ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేశారు? చట్టపరమైన నిబంధనలు పాటించకుండా అరెస్టు చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలకు కేంద్రం ఎలాంటి రక్షణ కల్పిస్తోంది? అని అడిగారు. అయితే సోషల్ మీడియా కార్యకర్తలను రక్షించడం ప్రాథమికంగా తమ బాధ్యత కాదని, రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం పోలీస్, శాంతిభద్రతలు అనేవి రాష్ట్ర పరిధిలోని అంశాలని వైవీకి రాజ్యాంగ పాఠాలు చెప్పింది. ఇటువంటి కేసుల నివారణ, గుర్తింపు, నమోదు, విచారణ, ప్రాసిక్యూషన్ వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో భాగమని కేంద్రం గుర్తుచేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) పుస్తకంలో నేరాల గణాంకాలు ఉంటాయని, ఎప్పుడెప్పుడు ఎంతమంది అరెస్టయ్యారో చూసుకోవచ్చని సలహా ఇచ్చింది. వైవీ సుబ్బారెడ్డి అడిగిన వివరాలు 2024 తర్వాతవి. కానీ ప్రస్తుతం మూడేళ్ల కిందటి ఎన్‌సీఆర్‌బీ-2023 పుస్తకం మాత్రమే అందుబాటులో ఉంది.