పోలవరానికి పూర్తి సహకారం
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:23 AM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పరిహారం, పునరావాసాల కల్పనకు నిధులివ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర జల శక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు స్పష్టం చేశారు.
భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పరిహారాలకు నిధులివ్వడానికి కేంద్రం సిద్ధం
కేంద్ర జలశక్తి కార్యదర్శి కాంతారావు
ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర బృందం
రాజమండ్రిలో పీపీఏ ఆఫీసు ప్రారంభం
పోలవరం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పరిహారం, పునరావాసాల కల్పనకు నిధులివ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర జల శక్తి కార్యదర్శి వీఎల్ కాంతారావు స్పష్టం చేశారు. బుధవారం కేంద్ర బృందం ప్రాజెక్టును సందర్శించింది. బృందంలోని కాంతారావు, ప్రాజెక్టు అథారిటీ సీఈవో యోగేశ్ ఫైఠాంకర్, నూతన సీఈవోగా నియమితులైన సంజీవ్ వోహ్రాలకు ఈఎన్‌సీ నరసింహమూర్తి, ఎస్‌ఈ రామచంద్రరావు, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. అనంతరం హిల్‌వ్యూ ప్రాంతం నుంచి కేంద్ర బృందం సభ్యులు ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు మోడల్ హౌస్ ప్రాంతాన్ని, స్పిల్‌వేపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. బట్రస్ డ్యాం పనులు, డి హిల్, పవర్ హౌస్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను, డయాఫ్రం వాల్ పనులను పరిశీలించారు. భోజన విరామానంతరం ప్రాజెక్టు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. జలశక్తి కార్యదర్శి మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతతో పాటు పనుల వేగంపై దృష్టి సారించాలని సూచించారు. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ప్రతి రోజూ ఒక లక్ష్యం పెట్టుకుని పనులు చేయాలని, డిజైన్లకు అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పీపీఏ కార్యాలయం ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉండడం వల్ల కొంత సమన్వయ లోపం జరిగిందన్నారు. ఇక నుంచి రాజమహేంద్రవరంలో నూతన అథారిటీ కార్యాలయం ఉంటుందని.. త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నిటితో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఇప్పటి వరకు సేకరించిన, సేకరించాల్సిన భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పునరావాసాల విషయంలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. ఏపీ జెన్‌కో అధికారులు పవర్ హౌస్ నిర్మాణం పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం రాజమహేంద్రవరం (బొమ్మూరు)లో పీపీపీఏ కార్యాలయాన్ని కాంతారావు ప్రారంభించారు. కార్యక్రమంలో పీపీఏ మెంబర్ సెక్రటరీ రఘునాథ్, మేఘా ప్రతినిధి అంగర సతీశ్‌బాబు, సీజీఎం గంగాధర్, ఏజీఎం మురళి పమ్మి తదితరులు పాల్గొన్నారు.