Share News

పత్తి రైతులకు సర్కారు భరోసా

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:57 AM

పత్తి రైతులకు పండుగ లాంటి వార్త చెప్పింది కేంద్రం. పండించిన పంటకు కనీస మద్దతు ధరను నేరుగా రైతుల ఖాతాలో జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

పత్తి రైతులకు సర్కారు భరోసా

  • ధర లోటు చెల్లింపు పథకానికి కేంద్రం శ్రీకారం

  • మద్దతు ధర నేరుగా రైతుల ఖాతాల్లో జమ

  • ఫైలట్‌ ప్రాజెక్టుగా తెలుగు రాష్ర్టాలు ఎంపిక

గుంటూరు సిటీ, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): పత్తి రైతులకు పండుగ లాంటి వార్త చెప్పింది కేంద్రం. పండించిన పంటకు కనీస మద్దతు ధరను నేరుగా రైతుల ఖాతాలో జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పత్తి రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ)కు ప్రత్యామ్నాయంగా ‘ధర లోటు చెల్లింపు పథకం’ (ప్రైస్‌ డెఫిషిట్‌ పేమెంట్‌ స్కీమ్‌) అమలుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి రైతులకు నేరుగా లాభాలు చేకూర్చే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు మార్కెట్‌ ధరలు పడిపోతే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) వంటి ప్రభుత్వ సంస్థలు నేరుగా పత్తి కొనుగోళ్లు నిర్వహించేవి. అయితే ఈ విధానం వల్ల నిల్వలు, గిడ్డంగులు, రవాణా వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ‘ధర లోటు చెల్లింపు పథకం’ను కేంద్రం ముందుకు తెస్తోంది. ఈ విధానంలో రైతు తన పత్తిని మార్కెట్‌లోనే అమ్ముకుంటాడు. మార్కెట్‌ ధర కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే, ఆ తేడా మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.


నీతి ఆయోగ్‌లో కీలక చర్చలు

ఈ పథకం అమలుపై న్యూఢిల్లీలోని నీతి ఆయోగ్‌ కార్యాలయంలో ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌చంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీసీఐ, పరిశోధన సంస్థలు, వ్యాపార వర్గాలు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. పత్తి కొనుగోళ్లలో ప్రస్తుతం అమలవుతున్న మద్దతు ధర విధానానికి ‘ధర లోటు చెల్లింపు పథకం’ సమర్థవంతమైన ప్రత్యామ్నాయం అవుతుందన్న అభిప్రాయం ఆ సమావేశంలో వ్యక్తమయినట్లు తెలిసింది. కాగా, దేశంలో రైతుల డేటాను డిజిటలైజ్‌ చేసి మార్కెట్‌ యార్డులకు అనుసంధానం చేసిన రాష్ర్టాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మాత్రమే. అందువల్ల ఈ రెండు రాష్ర్టాల్లోనే ముందుగా పైలట్‌ ప్రాజెక్ట్‌ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లో అనుకూలమైన మార్కెట్‌ యార్డులను గుర్తించాలని సీసీఐ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.


కొనుగోళ్లు పెరిగినా సమస్యలు అలాగే

టెక్స్‌టైల్స్‌ శాఖ వివరాల ప్రకారం.. ఈ సీజన్‌లో సుమారు 33 లక్షల బేల్స్‌ పత్తి కొనుగోలు జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది ఎక్కువే అయినా, నిల్వలు, నిర్వహణలో ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమస్యలను తగ్గించేందుకు ‘ధర లోటు చెల్లింపు పథకం’ ద్వారా మార్కెట్‌ ఆధారిత వ్యవస్థను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ‘ధర లోటు చెల్లింపు పథకం’ అమలైతే రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇది అమల్లోకి వస్తే మార్కెట్‌ ధరలు తగ్గినా రైతులకు నష్టం ఉండదు. మద్దతు ధర తేడా నేరుగా ఖాతాల్లో జమ అవుతుంది కాబట్టి మధ్యవర్తుల ప్రభావం తగ్గిపోతుంది.

Updated Date - Apr 13 , 2026 | 06:58 AM