Share News

విశాఖ ఉక్కుకు మరోమారు కేంద్రం సాయం

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:28 AM

విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి రెండో విడత ఆర్థిక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరిన ప్లాంటుకు సీఎం చంద్రబాబు..

విశాఖ ఉక్కుకు మరోమారు కేంద్రం సాయం

  • రూ.8,097 కోట్లు ఇచ్చేందుకు ప్రతిపాదన

  • రూ.6 వేల కోట్లతో కోక్‌ ఓవెన్ల నిర్మాణం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి రెండో విడత ఆర్థిక సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరిన ప్లాంటుకు సీఎం చంద్రబాబు అభ్యర్థన మేరకు కేంద్రం గతేడాది జనవరిలో రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఉక్కు శాఖ చెప్పినవన్నీ చేయడం, మూతపడిన మూడో బ్లాస్ట్‌ ఫర్నే్‌సను వినియోగంలోకి తేవడంతో ఉత్పత్తి పెరిగింది. ఈ ఏడాది జనవరిలో కర్మాగారం రూ.54 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. స్టీల్‌ తయారీకి అవసరమైన కోక్‌ ప్లాంటులోనే తయారవుతుంది. విదేశాల నుంచి కోకింగ్‌ కోల్‌ దిగుమతి చేసుకొని, కోక్‌ ఓవెన్‌ బ్యాటరీ(పారిశ్రామిక బట్టీ)ల ద్వారా కోక్‌ తయారు చేస్తారు. మొత్తం ఐదు బ్యాటరీలు ఉండగా వాటిలో రెండు(3, 4) పూర్తిగా పాడైపోయాయి. దాంతో వాటిని మార్చి నెలాఖరులో మూసేశారు. ఐదో నంబరు బ్యాటరీ కూడా మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం 1, 2 బ్యాటరీల ద్వారానే కోక్‌ తయారవుతోంది. ఇది పూర్తిస్థాయి ఉత్పత్తికి సరిపోవడం లేదు. దాంతో కోక్‌ను బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర పెట్టి కొంటున్నారు. కొత్త కోక్‌ ఓవెన్‌ బ్యాటరీ నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కోక్‌ బయట కొనడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగింది. కొత్త కోక్‌ ఓవెన్‌ బ్యాటరీ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఉక్కు శాఖ ప్రతిపాదించింది. దీనికి సుమారు రూ.6వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఇంకా మరికొన్ని పనులకు కలిపి మొత్తం రూ.8,097 కోట్ల ఆర్థిక సాయం కావాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదించింది. తొలుత ఆర్థిక శాఖ నిరాకరించినా... విశాఖ ఉక్కును నిలబెట్టాల్సి ఉందని కేంద్రంలో పెద్దలు స్పష్టం చేయడంతో ఆ ఫైల్‌కు ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. కొద్దిరోజుల్లో షరతులతో ఈ నిధులు విడుదల చేస్తారని ప్లాంటు వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 30 , 2026 | 03:28 AM