Share News

రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి ఊతం

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:04 AM

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర వ్యవసాయానికి ప్రాధాన్యం లభించింది. ఏపీ వ్యవసాయ రంగాన్ని పరిపుష్టం చేసేలా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి ఊతం

వ్యవసాయ మంత్రి అచ్చెన్న హర్షం

అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర వ్యవసాయానికి ప్రాధాన్యం లభించింది. ఏపీ వ్యవసాయ రంగాన్ని పరిపుష్టం చేసేలా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భూసారం వృద్ధి చెందడంతో పాటు రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు రూ.155.32 కోట్లను కేంద్రం కేటాయించింది. రిజర్వాయర్లలో చేపల పెంపకం ద్వారా మత్స్య రంగ అభివృద్ధికి ఊతమివ్వడంతో గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడే అవకాశం ఉంటుందని మత్స్యకార సంఘాల నేతలు భావిస్తున్నారు. పశుసంవర్ధకశాఖకు ప్రోత్సాహకాలు పెంచడం ద్వారా పాడి రైతులకు ఆర్థికభరోసా లభిస్తుందని డెయిరీ రంగ ప్రముఖులు తెలిపారు.

రైతుకు ఊతమిచ్చిన బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌లో ప్రకృతి వ్యవసాయానికి పెద్ద పీట వేయడం ద్వారా ఏపీ అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ.155.32కోట్లు కేటాయించడం కేంద్రప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని, దీని వల్ల భూసారం, రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు.

సామాన్యుడికి రక్షణ కవచం

‘2026-27 వార్షిక బడ్జెట్‌ దేశాభివృద్ధికి దిక్సూచిలా, సామాన్యుడికి రక్షణ కవచంలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక తోడ్పాటులో భాగంగా ఏపీకి నిధుల కేటాయింపులో సింహభాగం దక్కడం సంతోషకరం. ప్రపంచవ్యాప్తంగా అస్థిరతలు ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.12.2 లక్షల కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టడం మోదీ సర్కార్‌ దార్శనికతకు నిదర్శనం.’

- రామ్మోహన్‌ నాయుడు, కేంద్ర మంత్రి

Updated Date - Feb 02 , 2026 | 06:06 AM