జలజగడాలకు చెక్!
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:30 AM
తుంగభద్ర నదీ జల వివాద పరిష్కారం కోసం కేంద్రం నేతృత్వంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో ‘హైలెవల్ కమిటీ (ఉన్నత స్థాయి కమిటీ)’ వేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ప్రకటించారు.
తుంగభద్ర సమస్యలపై హైలెవల్ కమిటీ
కేంద్రం ఆప్షన్లు ఇస్తుంది.. మంచివి ఎంచుకోండి
జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సూచన
దేశంలో డ్యాంల పూడికతీతకు భారీ ప్రణాళిక
దీంతో తుంగభద్ర సామర్థ్యం 30 శాతం పెరుగుతుంది
పరస్పర సహకారంతోనే తుంగభద్రకు 33 కొత్త గేట్లు
నదుల లింకింగ్‌తో భారత్ ఏకతాటిపైకి: పాటిల్
ఐకమత్యంతోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం
ఇచ్చిపుచ్చుకుంటేనే ప్రయోజనం: చంద్రబాబు
తుంగభద్ర గేట్ల ఆధునికీకరణతో 3 తరాల నీటి సమస్యకు పరిష్కారం: రేవంత్
రైతుల కోసం సమన్వయంతో పనిచేస్తాం: డీకే
నదుల అనుసంధానమే నీటి యుద్ధాలకు పరిష్కారం. జలాలను పొదుపుగా వాడుకుంటే సమస్యలే రావు. నీటి వివాదాలు రాకుండా రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి.
- సీఎం చంద్రబాబు
గతంలో మైసూరు మహారాజులు, హైదరాబాద్ నిజాంలు కలిసి రైతుల సంక్షేమానికి తుంగభద్ర ఆనకట్టను నిర్మించినట్లే.. నేడు ప్రజాప్రతినిధులు కూడా రైతుల ప్రయోజనాల కోసం ఒకే వేదికపైకి రావాలి.
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
బళ్లారి/అమరావతి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదీ జల వివాద పరిష్కారం కోసం కేంద్రం నేతృత్వంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో ‘హైలెవల్ కమిటీ (ఉన్నత స్థాయి కమిటీ)’ వేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ప్రకటించారు. ఈ కమిటీ 100 రోజుల్లోగా జల వివాదాల పరిష్కార చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. దాదాపు 70 ఏళ్లుగా తుంగభద్ర నీటి కోసం వివాదాలు నెలకొన్న నేపథ్యంలో వాటిని పరిష్కరించడానికి జలశక్తి మంత్రి చొరవ చూపారు. తుంగభద్ర డ్యాంకు ఏర్పాటు చేసిన కొత్త క్రస్ట్ గేట్లను పాటిల్ గురువారం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, డీకే శివకుమార్, ఎ.రేవంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. తొలుత 17, 18, 19, 20వ నంబరు గేట్ల వద్ద పూజలు నిర్వహించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం డ్యాం దిగువన కొప్పళ జిల్లా మునిరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఏపీ, కర్ణాటక నుంచి పెద్దసంఖ్యలో రైతులు తరలివచ్చారు.
తుంగభద్ర సంబంధిత వివాదాల పరిష్కారం కోసం కేంద్రం సీనియర్ అధికారులతో త్వరలోనే ఉన్నత స్థాయి కమిటీ వేస్తుందని పాటిల్ తెలిపారు. ఈ కమిటీ కొన్ని ఆప్షన్లు ఇస్తుందని.. వాటిలో ప్రయోజనం చేకూర్చేవాటిని ఆయా రాష్ట్రాలు ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈ ప్రతిపాదనను ముగ్గురు సీఎంలు స్వాగతించారు. దేశవ్యాప్తంగా అనేక ఆనకట్టల్లో 15 శాతానికి పైగా పూడిక పేరుకుపోయిందని, దీంతో నీటినిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని పాటిల్ చెప్పారు. సమస్య శాశ్వత పరిష్కారానికి పూడిక తొలగింపు కోసం కేంద్రం సొంత నిధులతో త్వరలో భారీ ప్రణాళిక అమలు చేయనుందని తెలిపారు. దీని అమలు బాధ్యతను రాష్ట్రాలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. తుంగభద్ర జలాశయంలో కూడా 15శాతానికి పైగా పూడిక పేరుకుపోయిందని.. విజయవంతంగా పూడిక తీస్తే నీటి నిల్వ సామర్ధ్యం 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక మధ్య జలవివాదాలు ఉన్నప్పటికీ.. తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవానికి ముగ్గురు సీఎంలూ ఒకే వేదికపైకి వచ్చారని, సహకార భావంతో ముందుకు సాగడం చరిత్రాత్మక పరిణామమని పాటిల్ తెలిపారు. పరస్పర సహకారం, ఆర్థిక మద్దతుతోనే తుంగభద్ర జలాశయానికి అత్యవసరంగా 33 నూతన గేట్లను అమర్చడం సాధ్యమైందని గుర్తుచేశారు. నదీ జలాల విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు సమన్వయంతో.. సామరస్యపూర్వకంగా వివాదాలకు తావులేకుండా పరిష్కరించుకుంటున్నాయని పాటిల్ వివరించారు. నదుల అనుసంధానం కోసం కేంద్రం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ నదీ జలాలను పారిస్తున్నాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు నేరుగా పైపుల ద్వారా పొలాల్లోకే నేరుగా సాగునీటిని తీసుకువెళ్తూ రెండు పంటలు పడిస్తున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కూడా కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటూ నదుల అనుసంధాన పథకాన్ని చేపట్టేందుకు ముందుకు రావాలని పాటిల్ సూచించారు.తమకొక రాష్ట్రం ఎక్కువ కాదు.. మరో రాష్ట్రం తక్కువా కాదని స్పష్టం చేశారు. రాష్ట్రాలు బాగుపడితేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని కేంద్రం బలంగా నమ్ముతోందన్నారు.
రైతుల భవిత కోసం మూడు రాష్ట్రాల ఐక్యత
- కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ వెల్లడి
తుంగభద్ర పరివాహక ప్రాంత రైతుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఐక్యంగా ఉండాలని చరిత్రాత్మక నిర్ణయానికి వచ్చాయని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సభలో అన్నారు. ‘జలవనరుల శాఖ చరిత్రలో ఈ రోజు ఒక మైలురాయి. మన నీరు-మన హక్కు అనే భావనతో మూడు రాష్ట్రాల రైతుల సంక్షేమాన్ని కాపాడే దిశగా ఈ సమావేశం జరిగింది. తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. కొద్ది రోజుల్లోనే స్టాప్‌లాక్‌ను అమర్చింది. భవిష్యత్‌లో డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని మొత్తం 33 స్పిల్‌వే గేట్లను మార్చే సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక నాయకత్వం కలిసి రైతుల ప్రయోజనాల కోసం ఒకే వేదికపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం. రైతులకు జీతం లేదు, పదోన్నతి లేదు, పెన్షన్ లేదు అయినా దేశానికి అన్నం పెడుతున్నారు. అలాంటి రైతుల సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత’ అని చెప్పారు.
బాబు పట్టుదలతో ఓ నగరమే అభివృద్ధి
‘బెంగళూరు సహజసిద్ధంగా అభివృద్ధి చెందిన నగరం. ఇక్కడి వాతావరణం, లాజిస్టిక్స్ నగరాభివృద్ధికి దోహదపడ్డాయి. కానీ హైదరాబాద్ పరిస్థితి అలా కాదు. ఆ నగరాన్ని చంద్రబాబు పట్టుదల, అనుభవం, దూరదృష్టితో ఐటీతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు’ అని సీఎం డీకే శివకుమార్ ప్రశంసించారు. కొత్త గేట్ల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు కర్ణాటక వెళ్లిన చంద్రబాబు హోస్పేట్‌లోని ఐఆర్బీ అతిథిగృహంలో శివకుమార్, రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శివకుమార్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను, చంద్రబాబు ఇద్దరం యువజన కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిమేనని.. ఆయన పోరాటస్ఫూర్తి, పట్టుదల, దూరదృష్టి గురించి పలు సందర్భాల్లో తాను మాట్లాడుతుంటానని చెప్పారు. కేంద్ర మంత్రి పాటిల్ సైతం.. దేశంలో అభివృద్ధిపై దృష్టి సారించిన నాయకుల్లో చంద్రబాబు ముందువరుసలో ఉంటారని చెప్పారు.
చంద్రబాబు శ్రద్ధే కారణం
లేదంటే నాలుగైదేళ్లు పట్టేది: కన్నయ్యనాయుడు
తుంగభద్ర డ్యాంకు యుద్ధప్రాతిపదికన కొత్త క్రస్ట్‌గేట్లను అమర్చడంపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపారని, లేకుంటే ఈ క్రస్ట్ గేట్ల అమరిక మరో నాలుగైదేళ్లు ఆలస్యమయ్యేదని ఇంజనీరింగ్/గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు అన్నారు. తుంగభద్ర డ్యాంపై ఆయన మాట్లాడారు. మరో 50 ఏళ్ల వరకూ డ్యాంకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తదని భరోసా ఇచ్చారు. దక్షిణాదిలో ఏ ప్రాజెక్టుకూ 60అడుగుల వెడల్పు గల గేట్లు లేవన్నారు.