మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి?
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:34 AM
ఇంట్లో ఎంత మంది ఉన్నారు? అంటూ ఎప్పుడూ అడిగే ప్రశ్నతో పాటు ఈ సారి జనాభా లెక్కల కోసం వచ్చే అధికారులు..
ఏమి తింటున్నారు!
ల్యాప్‌టాప్, కంప్యూటర్లు ఉన్నాయా?
ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా?
ద్విచక్ర వాహనాలు ఏమున్నాయి?
కారు/జీపు/వ్యాన్ ఉన్నాయా?
ఈసారి జనగణనలో 33 ప్రశ్నలు
త్వరలో దేశవ్యాప్తంగా ప్రారంభం
అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఎంత మంది ఉన్నారు? అంటూ ఎప్పుడూ అడిగే ప్రశ్నతో పాటు ఈ సారి జనాభా లెక్కల కోసం వచ్చే అధికారులు.. ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి? ల్యాప్‌టాప్, కంప్యూటర్లు ఉన్నాయా? అన్న ప్రశ్నలు కూడా అడుగుతారు. మారిన జీవనశైలికి అనుగుణంగా కేంద్రం జనాభా లెక్కల ప్రశ్నలను కూడా మార్చేసింది. రకరకాల కారణాలతో 2021 నుంచి వాయిదా పడుతూ వస్తున్న జనగణనను చేపట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఇందుకోసం 33 ప్రశ్నలు సిద్ధం చేసింది. ఒక కుటుంబాన్ని పూర్తిగా అధ్యయనం చేసేలా ఈ ప్రశ్నావళి ఉంది. చివరిగా 2011లో జనాభాను లెక్కించారు. 2021లో కరోనా కారణంగా, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల కారణంగా వాయిదా పడిన జనగణన ప్రక్రియ దేశవ్యాప్తంగా త్వరలో ప్రారంభమవుతుంది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను విభజించాలని కేంద్రం యోచిస్తోంది. జనగణన పూర్తయితే 2029లో సీట్లు పెరుగుతాయని, మహిళా రిజర్వేషన్లు కూడా అమలవుతాయని భావిస్తున్నారు. కులగణన, జనాభా లెక్కింపు ఒకేసారి చేస్తారన్న ప్రచారం జాతీయస్థాయిలో కొంతకాలంగా జరుగుతోంది. కానీ జనాభా లెక్కల ప్రశ్నావళిలో కులం కచ్చితంగా తెలుసుకునేలా ఎలాంటి ప్రశ్నలూ లేవు. ఎస్సీ/ఎస్టీ/అదర్ అనే ప్రశ్న ఉంది.
జనగణనలో అడిగే ప్రశ్నలు..
1. ఇంటి నంబరు
2. జనగణన జాబితాలో కేటాయించిన నంబరు
3. ఇంటిలో ఫ్లోర్‌కు వాడిన మెటీరియల్
4. ఇంటి గోడల నిర్మాణానికి వాడిన మెటీరియల్
5. ఇంటి పైకప్పులో వాడిన మెటీరియల్
6. ఇంటిని ఎలా వాడుతున్నారు? (రెసిడెన్షియల్‌గా, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, ఖాళీగా ఉందా)
7. ఇల్లు ఆవాసయోగ్యమేనా.. శిథిలావస్థలో ఉందా?
8. కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత?
9. ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వారెంతమంది ?
10. ఇంటి పెద్ద పేరు?
11. ఇంటి పెద్ద మహిళా? పురుషుడా?
12. ఇంటి పెద్ద ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర సామాజిక వర్గానికి చెందినవారా ?
13. ఉంటున్న ఇల్లు సొంతమా? అద్దె ఇల్లా?
14. ఇంట్లో ఎన్ని గదులు వాడుకుంటున్నారు?
15. ఇంట్లో పెళ్లయిన జంటలు ఎన్ని ఉన్నాయి?
16. తాగునీటి కోసం ప్రధానంగా దేనిపై ఆధారపడుతున్నారు?
17. తాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయా?
18. ఇంట్లో విద్యుత్ అవసరాలకు ఏ వనరులు ఉపయోగిస్తున్నారు. విద్యుత్, సోలార్ విద్యుత్, ఇతర మార్గాలు?
19. మరుగుదొడ్లు ఇంట్లోనే ఉన్నాయా?
20. ఏ రకమైన మరుగుదొడ్లు ఉన్నాయి?
21. ఇంటికి డ్రైనేజీ వ్యవస్థ ఉందా?
22. బాత్‌రూమ్‌లకు పైకప్పు ఉందా? డ్రైనేజీ ఉందా?
23. కిచెన్ ఉందా? ఎల్‌పీజీ/పీఎన్‌జీ వాడుతున్నారా?
24. వంటకోసం ప్రధానంగా వాడే ఇంధనం?
25. రేడియో/ట్రాన్సిస్టర్ ఉందా?
26. టీవీ ఉందా?
27. ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా?
28. ల్యాప్‌టాప్/కంప్యూటర్లు ఉన్నాయా ?
29. టెలిఫోన్/మొబైల్‌ఫోన్లు/స్మార్ట్‌ఫోన్లు ఎన్ని ఉన్నాయి?
30. ద్విచక్ర వాహనాలు ఏవేవి ఉన్నాయి?
31. కారు/జీపు/వ్యాన్ ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి?
32. ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యాలు ఏవి?
33. ఫోన్ నంబరు ఎంత? (జనాభా లెక్కల ఆధారిత సమాచారం కోసం)