డ్రగ్స్ వద్దు.. హెల్మెట్ ముద్దు
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:19 AM
జీవితాలను నాశనం చేసే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ప్రాణాలను రక్షించే హెల్మెట్‌ను ధరించాలని సినీ తారలు పిలుపునిచ్చారు.
మడకశిరలో సినీ తారలతో బైక్ ర్యాలీ
మడకశిర, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జీవితాలను నాశనం చేసే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ప్రాణాలను రక్షించే హెల్మెట్‌ను ధరించాలని సినీ తారలు పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సినీ తారలు శ్రీవిష్ణు, కారుమంచి రఘు, హెబ్బా పటేల్, అనన్య నాగళ్ల, అంధుల క్రికెట్ మహిళల జట్టు కెప్టెన్ దీపిక, ఎస్పీ సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి జ్యోతిబా ఫూలే సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ‘వైసీపీ పాలనలో డ్రగ్స్, గంజాయి ఎక్కడ దొరికినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండేవి. మత్తు పదార్థాలు వాడితే భవిషత్తు బుగ్గిపాలవుతుంది. కుటుంబాలు నాశనమవుతాయి. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో మార్పు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. డ్రగ్స్, గంజాయి వాడకంపై ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ సంకల్పంతో ఇటీవల జరిగిన సమీక్షలో పోలీసులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం చెప్పిరాదు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంలో ప్రయాణించాలి’ అని కోరారు.