పోరస్ హోల్స్‌లో పూడిక తొలగించకుంటే సాగర్‌కు ముప్పే
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:56 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు గ్యాలరీల్లోని(స్పిల్‌వే వెనుక ప్రదేశం) పోరస్ హోల్స్‌లో పేరుకుపోయిన కాల్షియంను ఆధునిక పద్ధతిలో తొలగించకుంటే ప్రాజెక్టుకు ముప్పు తప్పదని సమగ్ర డ్యాం భద్రత అంచనా(సీడీఎస్ఈ) చైర్మన్ దేవేంద్రకుమార్‌శర్మ చెప్పారు.
స్పిల్‌వే గుంతలనూ పూడ్చివేయాలి
సీడీఎస్ఈ చైర్మన్ స్పష్టీకరణ
ప్రాజెక్టు గ్యాలరీలు, కుడి, ఎడమ కాల్వల పరిశీలన
స్పిల్‌వే గుంతల పూడ్చివేతకు.. ఎం60 కాంక్రీట్ వాడుతామన్న సీఈ
నాగార్జునసాగర్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : నాగార్జునసాగర్ ప్రాజెక్టు గ్యాలరీల్లోని(స్పిల్‌వే వెనుక ప్రదేశం) పోరస్ హోల్స్‌లో పేరుకుపోయిన కాల్షియంను ఆధునిక పద్ధతిలో తొలగించకుంటే ప్రాజెక్టుకు ముప్పు తప్పదని సమగ్ర డ్యాం భద్రత అంచనా(సీడీఎస్ఈ) చైర్మన్ దేవేంద్రకుమార్‌శర్మ చెప్పారు. సీడీఎ్‌సఈమరో ఇద్దరు సభ్యులు, ప్రాజెక్టు అధికారులతో కలిసి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ గ్యాలరీలను, స్పిల్‌వేను సోమవారం పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేంద్రకుమార్‌శర్మ మాట్లాడుతూ.. గ్యాలరీల్లోని పోరస్ హోల్స్‌లో కాల్షియం పేరుకుపోవడంతో సీపేజీ(ఊట నీరు) తక్కువగా వస్తున్న విషయాన్ని గుర్తించి నమోదు చేసుకున్నామన్నారు. పోరస్ హోల్స్‌లో పేరుకుపోయిన కాల్షియాన్ని ఆధునిక పద్ధతిలో తొలగించకుంటే ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉన్నట్లేనని పేర్కొన్నారు. ఈ విషయమై కేంద్రానికి నివేదిక అందజేస్తామన్నారు. స్పిల్‌వేపై పడిన గుంతలను పూడ్చివేయడానికి ఆధునికపద్ధతిలో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టు సీఈ శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ.. సీడీఎ్‌సఈ సభ్యుల సూచనల మేరకు స్పిల్‌వే మరమ్మతులు, అలాగే గ్యాలరీల్లోని పోరస్ హోల్స్‌లో పేరుకుపోయిన కాల్షియం తొలగింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. 2023లో స్పిల్‌వే మరమ్మతులకు ఎం25 కాంక్రీట్‌ను వాడటంతో ఏడాదిలోనే స్పిల్‌వేపై గుంతలు పడ్డాయని, ఈసారి మరమ్మతుల్లో ఎం60 కాంక్రీట్‌ను వాడుతామన్నారు. కార్యక్రమంలో సీడీఎ్‌సఈ సభ్యులు గుల్షన్‌రాజ్, జేఎం గౌతమ్, ప్రాజెక్టు ఎస్‌ఈ మల్లికార్జున్‌రావు, ఈఈ సీతారాం తదితరులు పాల్గొన్నారు.