Share News

ప్రక్షాళన అవశ్యం!

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:54 AM

టీటీడీ పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావాలని సీబీఐ ‘సిట్‌’ స్పష్టం చేసింది. సమూలంగా ప్రక్షాళన చేయాలని, కీలకమైన రంగాల్లో మారిన పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాని సిఫారసు చేసింది.

ప్రక్షాళన అవశ్యం!

  • టీటీడీలో పాతుకుపోయిన వ్యవస్థీకృత లోపాలు

  • రాష్ట్ర ప్రభుత్వానికి ‘సిట్‌’ నివేదిక

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

టీటీడీ పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావాలని సీబీఐ ‘సిట్‌’ స్పష్టం చేసింది. సమూలంగా ప్రక్షాళన చేయాలని, కీలకమైన రంగాల్లో మారిన పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాని సిఫారసు చేసింది. వీటిపై సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.వీరేశ్‌ ప్రభు గత నెల 27న రాష్ట్రప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వివరాలివీ...

  • టీటీడీ పాలనా వ్యవస్థలో పాతుకుపోయిన విధానపరమైన లోపాలు, టెండరు ప్రక్రియలో తప్పిదాలు, పర్యవేక్షణ, తనిఖీ పునఃపరిశీలన లేకపోవడంవల్లే కల్తీ నెయ్యి కొనుగోలుకు దారితీశాయి.

  • టీటీడీలో ప్రాథమిక ధర లేకుండానే నెయ్యి కొనుగోళ్లకు రివర్స్‌ టెండర్‌ నిర్వహించారు. దీంతో పోటీదారులు తక్కువ ధరను కోట్‌చేశారు. రివర్స్‌ టెండర్‌ను ఎత్తేయాలి. దానిస్థానంలో కఠినమైన నిబంధనలు, ప్రమాణాలు, ఇంకా బెంచ్‌మార్క్‌ ధరలతో ప్రత్యామ్నాయ కొనుగోలు విధానం తీసుకురావాలి.

  • నెయ్యి కొనుగోలు టెండర్‌ నిబంధనలను 2019 ఆగస్టులో బలోపేతం చేశారు. కానీ 2020 ఫిబ్రవరిలో సరైన హేతుబద్ధత, నిర్దిష్టమైన కారణాలు లేకుండానే సడలించేశారు. అలా ఎందుకు చేశారో తెలిపే డాక్యుమెంట్లు కూడా లేవు. నిపుణుల అధ్యయనాలు, సిఫారసుల ఆధారంగా, హేతుబద్ధమైన కారణాలు, వాటిని నిర్దేశించే డాక్యుమెంట్లను పరిశీలించాకే నిబంధనలు మార్చాలి.

  • కల్తీనెయ్యి సరఫరాచేసిన కంపెనీలు తప్పుడు పత్రాలు సమర్పించినా నిర్ధారించుకోకుండా ఆమోదించారు. కంపెనీలు ఇచ్చిన డాక్యుమెంట్లు సరైనవో, కాదో నిర్ధారించే వ్యవస్థ టీటీడీలో ఉండాలి.

  • టీటీడీలో ప్రస్తుతం డెయిరీ, నెయ్యి నాణ్యతను నిర్ధారించే నిపుణులు సిఫారసు (రిఫరెన్స్‌)లపై, తాత్కాలిక ప్రతిపాదికన వచ్చినవారే. వారి విధులేమిటి? పాత్ర ఏమిటో నిర్దేశించడంలేదు. వారినే కొనసాగిస్తుండటం వల్ల కంపెనీలతో కుమ్మక్కయ్యే అవకాశం ఏర్పడుతోంది.


  • సాంకేతిక కమిటీలో ఉన్న సభ్యులే, ప్లాంట్‌ల తనిఖీ కమిటీలో ఉంటున్నారు. ఇది సరైనది కాదు. ఒక కమిటీలో ఉన్న సభ్యులు మరో కమిటీలో ఉండకూడదు. ఆయా కంపెనీల వాస్తవిక పరిస్థితిపై టీటీడీ విజిలెన్స్‌ నుంచి నివేదిక తెప్పించుకున్నాకే తుది నిర్ణయం తీసుకోవాలి.

  • టీటీడీకి నెయ్యి సరఫరా చేసే ట్యాంకర్ల కదిలికలను ట్రాక్‌ చేసే ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలి. ఇది లేకపోవడం వల్లే అనేక తప్పులు జరిగాయి.

  • టీటీడీలో నెయ్యి పరీక్షా కేంద్రం పరిమిత వనరులతో ఉంది. మరింత ఆధునిక హంగులతో పరిశోధనా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలి. శాంపిల్స్‌ను తారుమారు చేయడానికి వీలులేని శాంపిల్‌ కోడింగ్‌ విధానం తీసుకురావాలి.

  • ఒక్కసారి కల్తీ జరిగిందని నిర్ధారణ అయితే, సంబంధిత కంపెనీల ట్యాంకర్లను సీజ్‌ చేయడంతోపాటు సరఫరాదారుపై చర్యలు తీసుకోవాలి. క్రిమినల్‌ ఫిర్యాదు నమోదుతోపాటు, టెండర్‌ దక్కించుకున్న సంస్థను బ్లాక్‌లిస్టులో చేర్చాలి.

  • నెయ్యి నాణ్యతపై పోటు సిబ్బందితో నిరంతరం సంప్రదిస్తూ... సమాచారం తీసుకోవాలి.

  • టీటీడీ ప్రసాదాలకోసం కొనుగోలు చేసే నెయ్యి, ఇతర పదార్థాల నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు థర్డ్‌పార్టీ క్వాలిటీ కంట్రోల్‌ ఉండాలి.

  • టీటీడీలో నెయ్యి నిల్వ గోడౌన్లను ఆధునికీకరించి.. వాటి పరిమితి, పరిధిని విస్తరించాలి.

  • టీటీడీలో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ బలంగా ఉండేలా చర్యలు చేపట్టాలి. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార విభాగం ఏర్పాటు చేయాలి.


పాలనలో తీసుకురావాల్సిన మార్పులు

  • టీటీడీలో ఈ-నోట్‌ ప్రతిపాదనల అంశంపై సీరియ్‌సగా దృష్టిపెట్టాలి. కీలకమైన అంశాల్లో జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లతోనే ఈ -నోట్‌ ప్రతిపాదనలు పెట్టిస్తున్నారు. కనీసం బుర్రపెట్టి ఆలోచించే పరిస్థితి ఉండటం లేదు. ప్రతీస్థాయిలో అధికారి విధులు, పాత్ర, జవాబుదారీ ఏమిటో స్పష్టంగా నిర్దేశించాలి. కొనుగోలు విభాగంలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. కొనుగోలు విభాగం జనరల్‌ మేనేజర్‌ పోస్టును ఇంజనీరింగ్‌ అధికారి నిర్వహిస్తుండటం గమనించాం. బాగా నిపుణులైన వారిని డిప్యుటేషన్‌ పద్ధతిలో ఈ పోస్టులో నియమించాలి.

  • టీటీడీలో ఆహార భద్రతను పరీక్షించే అధికారి లేరు. కొనుగోలు ప్రక్రియ, ప్లాంటు తనిఖీలు, శాంపిల్స్‌ పరీక్ష, ఆహార భద్రతా ప్రమాణాల తనీఖీలకు ఒక అధికారిని నియమించాలి.

  • టీటీడీలో ప్రస్తుత ఆర్థిక సలహాదారు-చీఫ్‌ అకౌంట్స్‌ అఫీసర్‌ (ఏఫ్‌ఏ-సీఏఓ) పోస్టును కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆర్థిక వ్యవహారాల్లో బాగా నిపుణులుగా ఉన్న అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి భర్తీచేయాలి.

Updated Date - Feb 04 , 2026 | 03:57 AM