Share News

వివేకా హత్య కేసులో మళ్లీ సీబీఐ విచారణ

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:01 AM

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ రెండేళ్ల తర్వాత మళ్లీ మొదలైంది. సుప్రీంకోర్టు సూచన మేరకు వివేకా హత్య కేసులో.....

వివేకా హత్య కేసులో మళ్లీ సీబీఐ విచారణ

కడప, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ రెండేళ్ల తర్వాత మళ్లీ మొదలైంది. సుప్రీంకోర్టు సూచన మేరకు వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్‌యాదవ్‌ సోదరుడు కిరణ్‌కుమార్‌ యాదవ్‌, అర్జున్‌రెడ్డి మధ్య జరిగిన కాల్‌ డేటాపై సీబీఐ విచారణ చేపట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందుల అర్బన్‌ పోలీ్‌సస్టేషన్‌కు సీబీఐ అధికారి రోహిత్‌యాదవ్‌ వచ్చారు. సునీల్‌యాదవ్‌ తమ్ముడు కిరణ్‌యాదవ్‌ను సీబీఐ విచారణకు పిలిచింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన భరత్‌యాదవ్‌ తమ్ముడు మహేంద్రకుమార్‌ యాదవ్‌ను, అర్జున్‌రెడ్డిలను కూడా విచారణకు పిలిచింది. ముందుగా మహేంద్రకుమార్‌ యాదవ్‌ను సీబీఐ అధికారి గంటన్నర పాటు విచారించారు. కిరణ్‌ యాదవ్‌, మహేంద్రయాదవ్‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలపై ప్రశ్నించినట్లు తెలిసింది. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కిరణ్‌యాదవ్‌.. సునీల్‌యాదవ్‌తో కలిసి పోలీ్‌సస్టేషన్‌కు వచ్చాడు. కిరణ్‌ యాదవ్‌, అర్జున్‌రెడ్డి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణల ఆధారంగా ప్రశ్నించినట్లు తెలిసింది. వివేకా హత్య విషయం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి తెలిసింది. కానీ కిరణ్‌యాదవ్‌ ఫోన్‌ నుంచి తన సోదరుడి స్నేహితుడు అర్జున్‌రెడ్డికి వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా అర్ధరాత్రి 1.40 గంటలకే వెళ్లినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఇదే విషయంపై సీబీఐ అధికారి ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ నెల 20న కిరణ్‌యాదవ్‌, అర్జున్‌రెడ్డిలను హైదరాబాద్‌లో విచారించారు. సీబీఐ అధికారి ఎదుట విచారణ అనంతరం మహేంద్ర యాదవ్‌ విలేకరులతో మాట్లాడాడు. కిరణ్‌యాదవ్‌కు ఎందుకు ఫోన్‌ చేశావని సీబీఐ అధికారి ప్రశ్నించారని తెలిపాడు. వివేకా హత్య జరగకముందు నుంచి కూడా తాము ఫోన్‌లో మాట్లాడేవారమని, తామంతా బంధువులమని చెప్పాడు. అనంతరం కిరణ్‌యాదవ్‌ విలేకరులతో మాట్లాడాడు. అర్జున్‌రెడ్డి, తనకు మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణల గురించి సీబీఐ అధికారి అడిగారని, ప్రశ్నలకు సమాధానమిచ్చానని అన్నాడు. ఈ కేసు విచారణ పూర్తి స్థాయిలో జరిగి, న్యాయం జరగాలంటే తాము ప్రాణాలతో ఉండాలన్నారు. అంతకుమించి ఏమీ చెప్పలేమని, కోర్టులో ఉన్న అంశమని అన్నాడు. శనివారం కూడా సీబీఐ పలువురిని విచారించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Feb 28 , 2026 | 05:01 AM