సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:45 AM
విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం నివేదన
న్యూఢిల్లీ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ చేపట్టినందున వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్‌పై ఇక విచారించాల్సిన అవసరం లేదని నివేదించింది. సాయికృష్ణ అక్రమ నిర్బంధం, డెత్, సాక్ష్యాధారాల ధ్వంసం వ్యవహారంలో ఏపీ డీజీపీ, విజయవాడ సీపీ, ఏసీపీల పాత్రపై విచారణ జరపాలని కోరుతూ గురుమూర్తి తొలుత విజయవాడ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విజయవాడ సౌత్ ఏసీపీ మానస హైకోర్టును ఆశ్రయించగా.. దిగువ కోర్టు ఆదేశాలను నిలిపివేస్తూ ఆగస్టు 13న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గురుమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ అపరేష్‌కుమార్ షింగ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించినట్లు తెలిపారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు. కోర్టుకు సెలవులు ఉండడంతో తాము దాఖలు చేసిన ఏఐ రికార్డు కాలేదని, సీబీఐ దర్యాప్తుతోపాటు కేసులో తాజా పరిణామాలను వివరించేందుకు సమయం కోరగా.. ధర్మాసనం విచారణను నవంబరు 3కి వాయిదా వేసింది.